ఏఎస్పీపై జగన్ పార్టీ దాడి, రక్షణ కల్పిస్తాం: భన్వర్ లాల్
కడప/హైదరాబాద్: కడప జిల్లా జమ్మలగుడి మండలం దేవగుడిలో ఏఎస్పీ అప్పలనాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో దేవగుడిలో భారీగా పోలీసులను మోహరించారు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలో కాంగ్రెసు పార్టీ ఏజెంటును కత్తితో బెదిరించారు.
పోలింగ్ అధికారిపై దాడి
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నడవలూరులో పోలింగ్ అధికారి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాడికి నిరసనగా సిబ్బంది పోలింగ్ నిలిపివేశారు. జగన్ పార్టీ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా పైన దౌర్జన్యానికి పాల్పడి, వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులను భారీగా మోహరించారు.

గుంటూరులో కిడ్నాప్
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రొంపిచర్ల మండలం ముత్తెనపల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు.
ఓటింగ్ బహిష్కరణ
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్బారావునగర్‌లో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వలేదని, తమ సమస్యలు పట్టించుకోని కారణంగానే తాము ఓటేయడం లేదని వారు తెలిపారు.
రక్షణ కల్పిస్తాం: భన్వర్ లాల్
నడవలూరులో మీడియా పైన దాడిని భన్వర్ లాల్ ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దేవగుడిలో దాడికి గురైన ఏఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు. తాము ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications