జగన్ అవిశ్వాస తీర్మానం వ్యూహం వెనుక.. టార్గెట్ భూమా, అఖిలప్రియ!
విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడతామని వైసిపి నేతలు చెబుతున్నారు. అవిశ్వాసం తీర్మానం వెనుక వైసిపి అధినేత జగన్ వ్యూహం మరొకటి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో 175 మంది శాసన సభ్యులు ఉన్నారు. టిడిపి - బిజెపి కూటమికి 108 స్థానాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 67 స్థానాలు వచ్చాయి. పైగా, ఇటీవల దాదాపు ఏడుగురు వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. ఈ నేపథ్యంలో జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది నెగ్గదని చెబుతున్నారు.
ప్రస్తుతం బిజెపి - టిడిపి ఎమ్మెల్యేలు, టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలతో కలిపి ప్రభుత్వం బలం 115కు చేరుకుంది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 60కి అటు ఇటుగా మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం లేదని అంటున్నారు.

అయితే, అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ వ్యూహం మరోలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం పెట్టి.. తద్వారా ప్రభుత్వానికి మద్దతు పలికే తన ఎమ్మెల్యేల పైన వేటు వేయించడం కోసం జగన్ అవిశ్వాసం వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్ తదితర ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. అవిశ్వాస తీర్మానం పెడితే వైసిపి... తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తుంది. టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి.. టిడిపికి ఓటు వేస్తారు.
అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరెవరు ఓటు వేశారో నిరూపించి, వారి పైన చర్యలకు స్పీకర్ పైన ఒత్తిడి తేవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. దీనిపై అవసరమైతే న్యాయస్థానం వెళ్లేందుకు కూడా తమకు అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications