పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ.. విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం
పేద విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించేందుకు ఆ అధికారి తాపత్రయం అంతా ఇంతా కాదు. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థులకు మంచి మార్కులు సాధిస్తే ఉచితంగా విమాన ప్రయాణం కల్పిస్తానని మాటిచ్చాడు. పదోతరగతి ఫలితాల్లో ఆ విద్యార్థులు సత్తా చాటారు. దీంతో ఆ అధికారి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
విషయం ఏంటంటే.. అనంతపురం జిల్లాలో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటిన ప్రతిభావంతులకు ఎంఈఓ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. జిల్లాలోని బెళుగుప్ప మండలంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను.. ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తానని ఎంఈఓ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థులు సత్తా చాటారు. అందరికీ 550 కుపై గా మార్కులు వచ్చాయి. దీంతో మల్లారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

బెళుగుప్ప మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించే విద్యార్థులకు ఆ మండల ఎంఈఓ మల్లారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తానని మాటిచ్చారు. దీంతో ఇందు, లావణ్య, ఈశ్వరి, అర్చన, మధుశ్రీ అనే విద్యార్థినిలు 550కి పైగా మార్కులు సాధించారు. పరీక్షల ముందు, విద్యార్థుల ప్రోత్సాహం కోసం ఎంఈఓ మల్లారెడ్డి ఒక హామీ ఇచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థినులు ఈ విజయాన్ని తెలుసుకుని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారుల అనుమతితో విమాన ప్రయాణానికి సిద్ధమయ్యారు.
విద్యార్థినులతో కలిసి మల్లారెడ్డి గురువారం బెళుగుప్ప నుండి బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణించారు. హైదరాబాద్ లో పర్యాటక ప్రదేశాలను విద్యార్థినులకు చూపించి తీసుకువస్తానని ఎంఈఓ వివరించారు. దీనికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. మల్లారెడ్డిని పలువురు అధికారులు అభినందించారు. ఇక రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి మే 28 వరకు జరుగుతాయి.












Click it and Unblock the Notifications