టిడిపి గెలుపు, జగన్ మెజార్టీపై బెట్టింగ్: తక్కువ సీట్లతోనే
హైదరాబాద్: సీమాంధ్రలో పోలింగ్ ముగిసిపోవడంతో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయట. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మీదే అధికంగా పందేలు కాస్తున్నారు. కౌంటింగ్ సమయం దగ్గరపడేకొద్దీ ఈ బెట్టింగ్ జోరు మరింత పెరగనుందంటున్నారు. అభ్యర్థుల గెలుపోటములతోపాటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది? ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఇలా రకరకాల బెట్టింగులకు పందెరాయుళ్లు సై అంటున్నారు.
రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం ఏదైనా 92 నుంచి 110 స్థానాలు గెలుచుకోగలదనే సంఖ్యపైనే ఇప్పుడు అత్యధికంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీకి కూడా 130 సీట్లు రావడం కష్టమని బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. వంద లోపు స్థానాలే వస్తాయని బెట్టింగులు కడుతున్నారు. సీమాంధ్రలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి... ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది... పులివెందుల్లో జగన్ మెజారిటీ కడప జిల్లాలో ఎవరికి ఎన్ని స్థానాలు అనే వాటిపై జోరుగా పందేలు సాగుతున్నాయి.

సీమాంధ్రలోని దాదాపు అన్ని జిల్లాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోందట. కడపలో అయితే మరింత ఎక్కువ స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది. జగన్ పార్టీ నేతలు పందాలు కాయడంలో ముందు ఉన్నారంటున్నారు. రాయచోటి అసెంబ్లీపై 30కి 100, పులివెందులలో జగన్ మెజారిటీపై 70కి 100 ప్రకారం పందాలు కాస్తున్నారట. పులివెందులలో జగన్ మెజార్టీ 80 శాతానికి పైగా ఉంటుందని బెట్టింగ్ కడుతున్నారట.
జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు, రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు, పులివెందులలో జగన్ మెజారిటీలపై బాగా పందాలు కాస్తున్నారు. అనంతపురం జిల్లాలో అనంతపురంతో పాటు గుంతకల్లు, తాడిపత్రి, మడకశిరల గెలుపు ఓటములపై జోరుగా పందాలు కాస్తున్నారు. హిందూపురం అసెంబ్లీ గెలుపు ఓటములతో పాటు దేశం అభ్యర్థి బాలకృష్ణ మెజారిటీ పైనా బెట్టింగ్ జరుగుతోంది. చిత్తూరులో తిరుపతి, నగిరి అసెంబ్లీలపై పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి.
నగరి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రోజా బరిలో ఉన్నారు. మదనపల్లె అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మెజారిటీపై కోట్లలో పందెం కాస్తున్నారు. కర్నూలు జిల్లాలో అయితే కర్నూలు సిటీలో టిజి వెంకటేష్ గెలుపు ఓటములపై జిల్లాలోనే అత్యధిక బెట్టింగ్ కాస్తున్నారట. వీటితో పాటు నంద్యాల, ఆదోని, పత్తికొండ అసెంబ్లీలలో గెలుపు ఓటములపై ఇరువర్గాలు భారీగా పందాలు కాస్తున్నారు.
ఆయా జిల్లాల్లో జగన్ పార్టీకి ఎన్ని సీట్లు, టిడిపికి ఎన్ని సీట్లు అనే దాని పైనా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. అనంతపురంలో కూడా టిడిపికి 10 సీట్లు వస్తాయని పందాలు కాస్తున్నారు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయన సాధించే మెజారిటీపై జోరుగా పందేలు కాస్తున్నారట. విశాఖపట్నం జిల్లాలో పార్టీ, అభ్యర్థుల విజయంపై జోరుగా పందాలు సాగుతున్నాయి.
విశాఖ జగన్ పార్టీ అభ్యర్థి విజయమ్మ గెలుపు, మెజార్టీ పైన అభిమానులు పందేలు కాస్తున్నారట. టిడిపికి 90 నుంచి 125 సీట్లు వస్తాయని, 18 నుంచి 20 పార్లమెంట్ సీట్లు వస్తాయని చాలా మంది బెట్టింగ్‌లకు రెడీ అంటున్నారు. జగన్ పార్టీ మీద కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా టిడిపి వైపే పందెం రాయుళ్లు మొగ్గు చూపుతున్నారట.












Click it and Unblock the Notifications