నామమాత్రమే!: హోదా, రాయితీలపై 2013లో మంత్రిగా పురంధేశ్వరి ప్రకటన ఇదీ
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా కావాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బంద్‌కు కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీకి హోదా కంటే ప్యాకేజీనే బెస్ట్ అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీరు ఇలా మొత్తం కలిపి 11 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించింది. హోదా పేరిట ఆయా రాష్ట్రాలకు ఏకరూప రాయితీలు ఇవ్వనేలేదని, ముఖ్యంగా పారిశ్రామిక రాయితీల రూపంలో అందించిన నిధులు చాలా తక్కువగా ఉన్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఇదే విషయాన్ని ప్రస్తుత బీజేప నాయకురాలు, అప్పటి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి 2013 మార్చి 20న రాజ్యసభలో వెల్లడించారు. ఆమె వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రత్యేక హోదా కలిగి పారిశ్రామిక రాయితీలు పొందుతున్న 8 రాష్ట్రాలకు మూడు సంవత్సరాల్లో లభించిన పోత్ర్సాహకాలు, రాయితీలు అసోంకు తప్ప ఏ రాష్ట్రానికీ రూ.100 కోట్లు కూడా దాటలేదు.
పురంధేశ్వరి రాజ్యసభలో వెల్లడించిన ఈ నివేదిక 2013 మందుకు సంబంధించినది కావడం విశేషం. పారిశ్రామిక రాయితీల కింద మూడేళ్లలో అరుణాచల్‌కు రూ.4.37 కోట్లు, అసోంకు రూ.109.28 కోట్లు, మేఘాలయకు రూ.80.01 కోట్లు, నాగాలాండ్‌కు రూ.కోటి, సిక్కింకు రూ.5.70 కోట్లు, త్రిపురకు రూ.2.35 కోట్లు మాత్రమే అందించారు.

ఇక మణిపూర్‌ది మరీ దారుణం. ఈ రాష్ట్రానికి మూడేళ్లలో రూ.11 లక్షలు ఇవ్వగా, మిజోరాంకు రూ.60 లక్షలు ఇచ్చారు. పురందేశ్వరి రాజ్యసభకు ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రత్యేక హోదా కింద మూడు రాష్ట్రాలకే ప్యాకేజీ ప్రకటించారు. 2013 నాటికి అత్యంత భయంకర అనిశ్చితి నెలకొన్నజమ్మూకాశ్మీర్‌కు మూడేళ్లలో ప్యాకేజీ రూపంలో అందించిన నిధులు రూ.106. 54 కోట్లు మాత్రమే. హిమాచల్‌కు రూ.156.27 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.101.06 కోట్లు ఇచ్చారు.
ప్రత్యేక హోదా కలిగి ఉన్నా వేల కోట్ల రూపాయలను పొందిన రాష్ట్రం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. అలాగే ప్రత్యేక హోదా కలిగి ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన రాయితీలు లేవు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని రాయితీలిచ్చారు. ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలకు 2017 మార్చి 31తో గడువు ముగుస్తోంది.
ఆ తర్వాత వాటిని కేంద్రం పొడిగించే అవకాశాల్లేవని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా లేని అండమాన్ నికోబార్, లక్షదీవులు, బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాకు గతంలో సరకు రవాణా రాయితీలు ప్రకటించారు. ఈ రాయితీలు గడువు 2018లో ముగియనుంది.












Click it and Unblock the Notifications