చంద్రబాబు పక్కా ప్లాన్: ఏం చేసినా అదే, పవన్ కల్యాణ్ వెనక...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని అంచనా వేసే పనిలో బిజెపి జాతీయ నాయకత్వం ఉంది. తమ పట్ల చంద్రబాబు గుర్రుగా ఉన్నారనే అభిప్రాయానికి బిజెపి వచ్చినట్లు భావిస్తన్నారు.
తమతో తెగదెంపులు చేసుకోవడానికే చంద్రబాబు సిద్ధపడ్డారని, అందుకు ఆయన సమయం తీసుకుంటున్నారని అంటున్నారు. ఒత్తిడికి తలొగ్గి చివరగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తే తీసుకుని రాంరాం చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు.

చంద్రబాబు ఆలోచన ఇలా..
చంద్రబాబు తెగదెంపులు చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో తనను బలహీనపరిచే దిశగా వ్యూహరచన చేసి అమలు చేస్తోందని ఆయన భావిస్తున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వ తీరుపై చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ మాత్రం తగ్గకుండా విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

గల్లాకు సన్మానం చేయడంపై
లోకసభ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌కు సన్మానం చేయడంపై బిజెపి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తద్వారా తెలుగుదేశం పార్టీ తమకు సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా భావిస్తోంది. ఒత్తిడికి తలొగ్గి సాయం చేసినా, చేయకపోయినా చంద్రబాబు తెగదెంపులు చేసుకోవడానికే సిద్ధపడ్డారనే అభిప్రాయానికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ నాయకులు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ ప్రశ్నకు సమాధానం లేదు...
చంద్రబాబు అడిగినా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ లభించకపోవడం తెలుగుదేశం పార్టీ వైఖరిలో మార్పు రావడానికి ప్రధాన కారణమని అంటున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రధాని కార్యాలయం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. ప్రధానిని చాలా మంది ఎంపీలు కలుస్తుంటారని, అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ప్రధాని చాలాసార్లు అపాయింట్‌మెంట్ ఇచ్చారని అంటున్నారు. అయితే, చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి కారణమేమిటనే ప్రశ్నకు బిజెపి వద్ద సరైన సమాధానం లేదు.

సాయంపై చంద్రబాబు ఆశలు వదిలేశారా...
కేంద్ర సాయంపై చంద్రబాబు దాదాపుగా ఆశలు వదిలేసినట్లేనని వార్తాకథనాలు వస్తున్నాయి. తెగదెంపులు చేసుకోవడానికే చంద్రబాబు సిద్ధపడ్డారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఒత్తిడి పెడుతున్న తీరుపై కూడా బిజెపి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకమైన బ్లాక్‌మెయిల్ పద్ధతి అని అంటున్నారు.

సమరం ఇలా సాగుతోంది..
రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై ఈ నెల 10వ తేదీన బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు విడుదల చేిన 27 పేజీల సమాచారాన్ని తప్పు పడుతూ తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ వాటికి పైసా కూడా ఇవ్వలేదని టిడిపి స్పష్టం చేసింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని పత్రికల్లో వచ్చే వార్తలు, సంపాదకీయాలు అనువాదం చేసి పిఎంవోకు చేర్చే పని క్రమం తప్పకుండా జరుగుతోందని అంటున్నారు. ఈ స్థితిలో ఇరు పార్టీల మధ్య తెగదెంపులు జరిగే పరిస్థితే ఉందని అంటున్నారు.

పవన్ కల్యాణ్ తీరుపై కూడా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై కూడా బిజెపి జాతీయ నాయకత్వం ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన వెనక చంద్రబాబు ఉన్నారని బిజెపి అనుమానిస్తోందని అంటున్నారు. ఈ విధమైన అభిప్రాయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రధానంగా తమను లక్ష్యంగా చేసుకుని కార్యాచరణను రూపొందించుకున్నారని బిజెపి భావిస్తోంది.












Click it and Unblock the Notifications