ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, లేదంటే...: బొత్స హెచ్చరిక
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై ఈ నెల 25వ తేదీ లోపు ప్రకటన చేయకపోతే 26వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతారని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. గొదావరి పుష్కారల తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ కంటితుడుపు చర్య మాత్రమేనని బొత్స అన్నారు.

కమిటీకి ఆరు నెలల గడువు ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం పంచ భూతాలను కూడా దొచుకుంటోందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వాటా ఎంత అని ఆయన అడిగారు. పట్టిసీమ ప్రాజెక్టులో చంద్రబాబు దోపిడీ ఎంతో చెప్పాలని ఆయన అడిగారు.
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తన, తన మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అధికారులను బలిపశువులుగా చేస్తున్నారని ఆయన అన్నారు ఇంత అవినీతి జరుగుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications