సెల్యూట్ అవసరంలేదు: కేసీఆర్‌కు బొత్స, బాబుపై ఫైర్
విజయవాడ/వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ పీసీసీ అధ్యక్షు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవారం మండిపడ్డారు. ఇక్కడ ఉండాలనుకుంటే తమకు సెల్యూట్ కొట్టి ఉండాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
దేశంలో ఎక్కడైనా బతికే హక్కును రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిందన్నారు. తెలంగాణలో బతకడానికి కేసీఆర్‌కు సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలో ఉంటాయన్నారు. కాబట్టి ఛానళ్ల నిషేధంపై గవర్నర్ నరసింహన్ వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి మహానుభావులకే సెల్యూట్ చేయాలన్నారు.
బొత్స ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కూడా మండిపడ్డారు. చంద్రబాబు వద్ద మంత్రదండమేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదన్నారు.

నాడు బాంచన్ దొర.. నేడు సెల్యూట్
నాడు నీ కాల్మొక్తా బాంచన్ దొరా అనకపోతే ఊరు నుంచి వెళ్లగొట్టేవారని, నేడు సెల్యూట్ అనకపోతే, పది కిలోమీటర్ల లోతున పాతరేస్తామంటున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని, ఎంతటి వారైనా రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని, అలా కాకుంటే రాజ్యాంగమే తగు సమయంలో బుద్ది చెబుతుందని మాజీ ఉపసభాపతి, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మంగళవారం వరంగల్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై భట్టి స్పందించారు. ఇది కేవలం పత్రికా రంగంపై చేసిన వ్యాఖ్యలుగా తాను భావించడం లేదని, ఎవరైనా తనకు సెల్యూట్ కొట్టకపోతే పాతరేస్తానని హెచ్చరించడమేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.












Click it and Unblock the Notifications