ఆరా మస్తాన్ కు బుద్దా వెంకన్న సవాల్-నాలుక కోసుకుంటా-నువ్వూ రెడీనా..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీల్లో కలకలం రేపాయి. ఏ ఎగ్జిట్ పోల్ కూడా నమ్మదగిన విధంగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకపోవడంతో ప్రధాన పార్టీలు తమకు అనుకూలంగా ఉండే ఎగ్జిట్ పోల్స్ ను వెతుక్కోవాల్సిన పరిస్ధితి. ఇదే క్రమంలో ఓ ప్రధాన సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఇవాళ ఆ సర్వే సంస్థకు బుద్ధా ఓ సవాల్ విసిరారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం జనం చూశారని బుద్ధా వెంకన్న తెలిపారు. ఆరా మస్తాన్ తో వైసిపి వస్తుందని జగన్ చెప్పించారన్నారు. రేపు కూటమి రాకుంటే తాను నాలుక కోసుకుంటానని బుద్ధా సవాల్ చేశారు. కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని ప్రశ్నించారు. జగన్ క్రిమినల్ ఆలోచనలతో ఫేక్ సర్వే చెప్పించారని బుద్ధా ఆరోపించారు. రేపు ఎన్నికలలో వైసిపి ఓడితే...తన జీవితం లో అసెంబ్లీ లో అడుగు పెట్టనని అని చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని బుద్దా అడిగారు.

నిన్న వచ్చిన సర్వేల్లో ఎక్కువ భాగం కూటమి అధికారం ఖాయంగా చెప్పాయని బుద్ధా వెంకన్న గుర్తుచేసారు. ఆరా మస్తాన్ సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు. వైసీపీ క్యాడర్ లో ఇప్పటికే ఓటమి నైరాశ్వం ఉందన్నారు. వారితో ఉత్సాహాన్ని నింపడానికి ఆరా సర్వే ఇప్పించుకున్నారన్నారు. ఇది ఫేక్ సర్వే అని వైసీపీ ముఖ్య నాయకులకు తెలుసన్నారు. బెట్టింగ్ లు కాయడానికి మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు.
వైసిపి కీలక నేతల అనుయాయులు టీడీపీ గెలుస్తుందని పందాలు కాశారని బుద్దా వెంకన్న తెలిపారు. ఈ సర్వే ద్వారా వైసీపీ అభిమానులు జగన్ తరపున బెట్టింగ్ కాస్తారన్నారు. ఆరా మస్తాన్ ఫేక్ సర్వేని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. కూటమికి 130 సీట్లకు పైగా వస్తాయి... ప్రజల్లో వేవ్ వచ్చిందన్నారు. ఎగ్జిట్ పోల్స్ కోసం గతంలో ప్రజలు ఎదురు చూసే వాళ్లు కాదన్నారు. కౌంటింగ్ ఏజెంట్ లుగా వెళ్లే విపక్ష పార్టీ లవారిని భయ పెట్టాలని చూస్తున్నారన్నారు.
చంద్రబాబు మళ్లీ సిఎంగానే అడుగుపెడతా అని గతంలో ప్రకటించారన్నారు. అన్న విధంగా రేపు సిఎంగా అసెంబ్లీ లో చంద్రబాబు అడుగు పెట్టడం ఖాయమన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఆరా మస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.నీతో ఎవరు అబద్దపు సర్వే చెప్పించారో వారి వివరాలు వెల్లడించాలని కోరారు. లేదంటే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే వైసీపీ అసలు ఖాతా తెరవదనేది వాస్తవమన్నారు. ఇటువంటి ఫేక్ సర్వేలతో వైసిపి అభిమానుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు.
మీ ధన దాహానికి మీ వారినే బెట్టింగ్ లతో దోచుకుంటారా అని మస్తాన్ ను బుద్ధా ప్రశ్నించారు. వైసీపీ ఇచ్చిన నివేదికను ఆరా మస్తాన్ చదివాడు అంతే అన్నారు. ఆరా మస్తాన్ నీకు చిత్తశుద్ధి ఉంటే జూన్ 4న సాయంత్రం అయినా వాస్తవాలు చెప్పాలన్నారు. జాతీయ సర్వేలు కూడా కూటమికే పట్టం కట్టాయని, ఆరా మస్తాన్ సర్వే అబద్దం అని ఇక్కడే తేలిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications