చంద్రబాబును చెప్పుతో కొట్టాలని వ్యాఖ్య: జగన్‌పై కేసు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై కృష్ణా జిల్లా పామర్రు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్యతో పాటు మరికొందరు కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.
జగన్‌పై ఐపీసీ 154 సెక్షన్ కింద కేసు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన తండ్రికి సమకాలికుడైన వ్యక్తిపై జగన్ ఈ తరహాలో వ్యాఖ్యానించడం శోచనీయమని వర్ల రామయ్య విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వైయస్ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని ఆయన సమర్థించుకున్నారు.

జగన్ ఓ మృగం: అచ్చెన్నాయుడు
జగన్ లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ ఓ మృగమని, మానవత్వం లేని మనిషని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అన్నారు. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు రాష్ట్రంలోని 5 కోట్ల మందిని అవమానించినట్లేనన్నారు. పనికిమాలిన, అవినీతిపరుడైన ఇలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండటానికి వీలులేదని ఆయన జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌ను 2014 ఎన్నికల్లోనే ప్రజలు చెప్పులతో కొట్టారని, అయినా అతనికి బుద్ధి రాలేదన్నారు.
ఐదుకోట్ల ఆంధ్రులను అవమానించినట్లే: కామినేని
రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలకు హద్దుండాలని తండ్రి వయసున్న చంద్రబాబుపై జగన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి, బిజెపి నేత కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ముఖ్మంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఐదు కోట్ల మంది ఆంధ్రులకు వర్తిస్తాయని, వారందరినీ జగన్ అవమానించినట్లేనన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీ దక్కలేదని అక్కసు ఉండొచ్చు గానీ అంతమాత్రాన నీచంగా మాట్లాడతారా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండటం వైఎస్ కుటుంబానికి ఇష్టం ఉండదని, తండ్రిలానే జగన్ కూడా అరాచకాన్ని కోరుకొంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications