భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా చర్చ మొత్తం దీన్ని గురించే నడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపటి అనంతపురం పర్యటనను వాయిదా వేసుకున్నారు. పులివెందులలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన తర్వాత కేసు దర్యాప్తు చేసే అధికారి హోదాలో డీఐజీ స్థాయి అధికారిని నియమించడం.. నెలాఖరులోగా కేసును పూర్తిచేయాలని కోర్టు ఆదేశించడంతో సీబీఐ కేసు వేగవంతం చేసిందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారంతోనే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసివుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 120 బి సెక్షన్ చాలా పెద్దదని తెలిపారు.

ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సేకరించిన విషయాల ఆధారంగానే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి ఉంటారని తాను భావిస్తున్నట్లు లక్ష్మీనారాయణ
చెప్పారు. ఇంకా ఈ కేసులో ఎంతమంది ఉన్నది..? ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది? అన్నది త్వరలోనే తేలుతుందన్నారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి హత్యకు గురైతే కేసు విచారణ ఇన్ని సంవత్సరాలు పట్టడం సరైందికాదన్నారు ఏప్రిల్ 30వ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి సీబీఐ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుందని భావిస్తున్నట్లు జేడీ స్పష్టం చేశారు












Click it and Unblock the Notifications