ఏపీకి ప్రత్యేక హోదాపై వెనుకడుగు లేదు కానీ: బీజేపీ
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వెనక్కి తగ్గలేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆదివారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏపీ అవసరాలన్నీ తీరుస్తామని చెప్పారు. ఆర్థికంగానూ ఆదుకుంటామన్నారు. అయితే, ఆంధ్రకు ప్రత్యేక హోదా మాటను వాడొద్దని తిరకాసు పెట్టారు. ప్రత్యేక హోదా కాకుండా మరో రూపంలో ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వవచ్చుననే వాదన ఎప్పటి నుండో ఉంది.
రాష్ట్ర విభజన సందర్భంగా తమ నాయకులు ఇచ్చిన హామీల అమలుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామన్నారు. దీనికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో 6500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు రాష్ట్రాన్ని నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా ప్రాజెక్టులు మంజూరు చేశామన్నారు.
కొత్త రాజధాని నిర్మాణం నిమిత్తం ఇప్పటికే నిధులు విడుదల చేశామన్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐటీ, ఐఐఎం ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన పూర్తయిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం
బీజేపీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న జేపీ నడ్డా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసే విధంగా మైక్రోప్లాన్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 27.5 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, వచ్చే మూడు నెలల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య మైత్రి అంశం ప్రస్తావించగా.. ప్రస్తుతం తాము కలిసి పని చేస్తున్నామన్నారు.
వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, పార్టీ బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరసన ఏపీ కూడా నిలువనుందని నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అభివృద్ధి చెందిందన్నరాు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 18 కోట్ల ఓట్లు సాధించిన బీజేపీ ప్రస్తుతం 10 కోట్ల సభ్యం కలిగి ఉండడం విశేషమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీగా సభ్యత్వ నమోదు కావడం సంతోషమన్నారు. వచ్చే నెల నుంచి మూడు నెలలపాటు జన సంపర్క్, మహాసంపర్క్ అభియాన్‌ను చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications