శంషాబాద్ వద్ద గజదొంగ శివకుమార్ ఎన్‌కౌంటర్
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ చైన్ స్నాచర్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతన్ని నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్మూరుపాడుకు చెందిన కడవలూరి శివగా గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి శంషాబాద్ సమీపంలోని కోత్వాల్‌గుడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఆరు నెలలుగా కడవలూరి శివ (28) సైబరాబాద్ కమిషనరేట్ పరధిలో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతడిపై నిఘా వేసిన పోలీసులకు అతను శుక్రవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. అతడు ఉపయోగిస్తున్న సెల్ నెంబర్ ఆధారంగా పోలీసులు అతని ఉనికిని గుర్తించారు. గాంతో అన్ని సర్వీసు రోడ్లపై తనిఖీలు చేపట్టారు.

విమానాశ్రయం పోలీసు స్టేషన్ నుంచి హుడా కాలనీకి వెళ్లే రోడ్డులో రాజేంద్రనగర్ సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ వై నర్సింహా రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా శివ ఎపి29 బీటీ 0120 నంబర్ ద్విచక్రవాహనంపై అర్థ రాత్రి సమయంలో అటుగా వచ్చాడు.
సిఐ అతన్ని ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేశాడు. ఇన్‌స్పక్టర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎస్సై అప్రమత్తమై అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఎస్సై పొట్టకు, చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఇన్‌స్పెక్టర్ సర్వీస్ రివాల్వర్‌తో మూడు రౌండ్లు కాల్చగా శివ అక్కడికక్కడే మరణించాడు.
గాయపడిన ఎస్సైని తొలుత శంషాబాద్ ట్రైడెంట్ అస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత అతన్ని మాదాపూర్‌లో ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. శివపై 250కి పైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు అదనపు డీసిపి (క్రైమ్స్) జానకి షర్మిల చెప్పారు.












Click it and Unblock the Notifications