రామరాజుకు చంద్రబాబు పిలుపు - ఉండి సీటు పై క్లారిటీ...!!
ఏపీలో గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీలో చేరిన రఘురామ రాజు సీటు వ్యవహారం పైన ఇంకా స్పష్టత రాలేదు. ఉండి నుంచి రఘురామ పోటీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో, అక్కడ టీడీపీ అభ్యర్దిగా ఖరారైన రామరాజు వర్గం ఆందోళన చేస్తోంది. నిరసనలు కొనసాగిస్తోంది. ఈ సమయంలోనే రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఉండి సీటు వషయంలో చంద్రబాబు నిర్ణయం ఉత్కంఠ పెంచుతోంది.
సీటు దక్కేదెవరికి
ఉండి నియోజకవర్గంలో టీడీపీ నుంచి చివరకు పోటీలో నిలిచేదెవరు. ఇప్పుడు పార్టీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు..ఉండి సీటు రామరాజు కు కేటాయించారు. ఆయన ప్రచారం ప్రారంభించారు. ఈ సమయంలోనే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమైన రఘురామకు బీజేపీ సీటు నిరాకరించింది. దీంతో, ఆయన టీడీపీలో చేరారు. రఘురామకు ఉండి సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఉండి ఎమ్మెల్యే అభ్యర్ది రామరాజుకు ఇదే రకమైన సంకేతాలు అందాయి.

రామారాజుకు పిలుపు
దీంతో, ఆయన మద్దతు దారులు ఆందోళన చేస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి నల్లజెండాలు.. ప్లకార్డులతో భారీ ఎత్తున ర్యాలీ చేసిన రామరాజు అనుచురులు సీతారామలక్ష్మి ఇంటి గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ఉండి ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గర నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. వంటావార్పుతో నిరసన తెలిపారు. రామరాజుకి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు. రఘురామ రాజుకు సీటు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో, రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది.

నిర్ణయం పై ఉత్కంఠ
అమలాపురంలో తన మద్దతు దారులతో సహా చంద్రబాబును కలిసేందుకు రామరాజు వెళ్లారు. చంద్రబాబు తీసుకొనే నిర్ణయానికి అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని రామరాజు మద్దతుదారులు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు రఘురామకే ఉండి సీటు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రామరాజుకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే ప్రాధాన్యత పైన హామీ ఇస్తారని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు ఉండి విషయంలో చంద్రబాబు తీసుకొనే నిర్ణయం పైన గోదావరి జిల్లాలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications