కీలకమైన జిల్లాలో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు!
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తన సహజ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా అభ్యర్థులను ఖరారు చేయరనే అపప్రధను ఎదుర్కొనే బాబు ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముండగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. మొహమాటంతో ఎంపిక చేసిన అభ్యర్థులవల్ల పరాజయమే మిగులుతుండగా.. ఈసారి పనిచేయనివారికి టికెట్ ఇవ్వనని ఖరాఖండిగా తెగేసి చెబుతున్నారు.
ఏడాది ముందుగానే: ఎన్నికలకు 6నెలల సమయం ఉండగానే అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కిరావాలనేది చంద్రబాబునాయుడి యోచనగా ఉంది. సీటు దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించడానికి వీలవుతుందనేది ఆయన భావన. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 11 మందిని ఎంపిక చేశారు. మిగతా మూడు నియోజకవర్గాల్లోనే ఒక స్పష్టత రావాల్సి ఉంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల్లో భాగంగా పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించిన చంద్రబాబు అక్కడికక్కడే అభ్యర్థులను ప్రకటించి పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశారు.

మూడింటిలోనే ఫైనల్ కావాలి: 1. పాణ్యంలో గౌరు చరితారెడ్డి, 2. కర్నూలు సిటీలో టీజీ భరత్, 3. మంత్రాలయంలో తిక్కారెడ్డి, 4. బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, 5. డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డి, 6. కోడుమూరులో ఆకెపోగు ప్రభాకర్, 7. శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, 8. ఆదోనిలో మీనాక్షి నాయుడు, 9. ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి, 10. పత్తికొండలో కేఈ శ్యామ్,11. ఆలూరులో కోట్ల సుజాతమ్మ పోటీచేయడం ఖాయమైంది. నందికొట్కూరు, ఆళ్లగడ్డ, నంద్యాలలోనే స్పష్టత రావాల్సి ఉంది. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ఇన్ చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరు పోటీచేస్తారా? కొత్త అభ్యర్థులు వస్తారా? అనే విషయమై కొంత ఉత్కంఠ నెలకొంది.
వరుస వివాదాల్లో అఖిలప్రియ: భూమా అఖిలప్రియ వరుసగా వివాదాల్లో కూరుకుపోవడం, తన సోదరుడు విఖ్యాత్ రెడ్డికి నంద్యాల సీటు కావాలంటూ ఆమె చంద్రబాబు దగ్గర పట్టుబడుతున్నారు. భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి కాకుండా భూమా కుటుంబం నుంచే వేరొకరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. రాయలసీమలో వైసీపీ ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్న చంద్రబాబు ఆ పార్టీకి కంచుకోటల్లాంటి జిల్లాలపై దృష్టిసారించి ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం, వైసీపీల్లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications