రోజా ఆస్పత్రిలో చేరడంపై ఆరా: మంత్రులకు చంద్రబాబు క్లాస్
హైదరాబాద్: శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఆస్పత్రిలో చేరిన విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ విషయంపై ఆయన పార్టీ నాయకులకు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో కాలికి స్వల్ప గాయమైందని వారు చంద్రబాబుకు చెప్పారు.
తెలంగాణ పోలీసులే రోజాను ఆస్పత్రికి తరలించారని, కూడా వారు చెప్పారు. రోజాను సస్పెండ్ చేయడం వల్ల ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసుకు సానుభూతి ఏమీ పెరగలేదని వారు చంద్రబాబుకు చెప్పారు. రోజా సస్పెన్షన్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని కొంత మంది శాసనసభ్యులు కూడా సమర్థిస్తున్నారని వారు చంద్రబాబుకు చెప్పారు.
కాగా, శాసనసభలో మంత్రుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం తీవ్రంగా దాడి చేస్తుంటే, మంత్రులు సరిగా స్పందించడం లేదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. మంత్రులు మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత శనివారం సాయంత్రం ఆయన మంత్రులతో సమావేశమయ్యారు.

కాల్ మనీ విషయంలో, రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయంలో వ్యక్తమవుతున్న ప్రతిస్పందనలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాడిని తిప్పికొట్టడంలో కొంత మంది మంత్రులు చురుగ్గా వ్యవహరించడం లేదని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
మా దురదృష్టం
వైయస్ జగన్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం తమ దురదృష్టమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బిఎసిలో తీసుకున్న నిర్ణయాలతో సంబంధం లేకుండా వైసిపి వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
సభను అడ్డుకుంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల కన్నా రాజకీయ ప్రయోజనాలకే వైసిపి ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications