చంద్రబాబు హోటల్ వద్ద ధర్నా, అసమ్మతి సెగ
హైదరాబాద్: సీమాంధ్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు పెల్లుబుకుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శనివారం విజయవాడలో చంద్రబాబు బస చేసిన హోటల్ వద్ద ధర్నాకు దిగారు.
లింగారెడ్డికి టికెట్ ఇవ్వకుండా వరదరాజులు రెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ కేటాయించడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో లింగారెడ్డి తన సతీమణితో పాటు చంద్రబాబును కలిశారు. శుక్రవారంనాడు ప్రొద్దుటూరులో లింగారెడ్డి అనుచరులు పార్ట జెండాలను దగ్ఘం చేసి తమ నిరసన వ్యక్తం చేసారు.
తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశ్శంకు టికెట్ ఇవ్వడంపై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యాలయం ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, జెండాలకు నిప్పు పెట్టారు. వర్మ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కార్యకర్తలు ప్రకటించారు.

మంగళగిరి శాసనసభా నియోజకవర్గం టిడిపిలో తలెత్తిన చిచ్చు శనివారంనాడు కూడా కొనసాగింది. మంగళగిరి సీటును గంజి చిరంజీవికి కేటాయించడంపై నియోజకవర్గం ఇంచార్జీ పొతినేని శ్రీనివాసరావు వర్గీయులు ఆందోళనకు దిగారు. టిడిపి కార్యాలయానికి తాళం వేసి, నల్లజెండాల ప్రదర్శన చేశారు. చిరంజీవిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్‌ను గద్దె రామ్మోహన్ రావుకు కేటాయించడంపై ఎంవివియస్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు తిరుగుబాటు అభ్యర్థిగా జయమంగళ వెంకటరణ నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్‌కు నర్సరావుపేట అభ్యర్థి జిలానీ అసెంబ్లీ బరి నుంచి తప్పుకుంటున్నాని ప్రకటించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎంపీగా కాసు కృష్ణారెడ్డి పోటీ చేస్తానంటేనే ఒప్పుకున్నానని తనను తెరిపైకి తెచ్చి వాళ్లు తప్పుకున్నారని జిలానీ తెలిపారు. కాసు కృష్ణా రెడ్డి తనయుడు మహేష్ రెడ్డి పోటీ చేయడానికి నిరాకరించడంతో ఆ టికెట్‌ను జిలానీకి ఇచ్చారు.












Click it and Unblock the Notifications