కుప్పంలో జగన్ చేసిందే పులివెందులలో చంద్రబాబు..! షర్మిల కామెంట్స్..!
ఏపీ రాజకీయాల్లో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ఫలితం ప్రకంపనలు రేపుతోంది. అధికార టీడీపీ పులివెందులలో విజయం కోసం అనుసరించిన వ్యూహం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చుక్కలు చూపించింది. అదే సమయంలో గతంలో వైఎస్ జగన్ కుప్పంలో దాదాపు ఇలాంటి వ్యూహంతోనే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు పులివెందుల ఫలితం తర్వాత అందరి నోటా కుప్పం ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఆనాడు ఖూనీ చేశారని, నేడు చంద్రబాబు పులివెందులలో అదే చేశారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వాళ్లేనన్నారు. ఇద్దరికి పెద్ద తేడాలేదన్నారు. రిగ్గింగ్ చేయడం అంటే వీళ్ళు తాలిబన్ లతో సమానమే అన్నారు.

చంద్రబాబు, జగన్ ఇద్దరూ కలిసి మోడీ కోసం పని చేస్తున్న వాళ్లేనని షర్మిల ఆరోపించారు. ఒకరిది బహిరంగ పొత్తు అయితే
మరొకరిది అక్రమ పొత్తు అన్నారు. మోడీతో ఇద్దరిది అలయ్ బలయ్ అన్నారు. రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీ ఊడిగం చేస్తున్న వాళ్లేనన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ బలపడాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. మోడీ ఓటు చోరీ తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే జగన్ మాట్లాడరని ఆరోపించారు.

స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని, ఈ దేశ అభివృద్ధిని పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని షర్మిల తెలిపారు. అప్పుడు,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతం అన్నారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమన్నారు.అనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బందీ అయ్యిందని, ఇప్పుడు మళ్ళీ మోడీ చేతిలో బందీ అయ్యిందని తెలిపారు. బీజేపీ చేతిలో దేశం బందీ అయ్యిందన్నారు. మోడీ నయా భారత్ అనడం విడ్డూరమని తెలిపారు. ఎక్కడుంది నయా భారత్ ? ఏమిటి నయా భారత్ ? ఆరెస్సెస్ జెండా,అజెండా అమలు చేయడం నయా భారత్ అంటారా ? అని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్చాలని చూడటం నయా భారత్ అంటారా ? అని ప్రశ్నించారు. ఇది నయా భారత్ కాదే...దగా భారత్ అన్నారు.












Click it and Unblock the Notifications