నాదే రికార్డు, పదేళ్లు ముఖ్యమంత్రిని: చంద్రబాబు

సోమవారం సాయంత్రం కడపలో జరిగిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకే బిజెపితో పొత్తు పెట్టుకున్నానని, ఈ పొత్తు నా కోసం కాదు, తెలుగు ప్రజల కోసము, జాతి శ్రేయస్సు కోసం కుదుర్చుకున్నానని చెప్పారు. రాష్ట్రం, దేశ శ్రేయస్సు కోసం మరికొందరి నాయకుల సహకారం అవసరం ఉందని, దానికోసం బిజెపితో జతకలిశామని వెల్లడించారు.
రాష్ట్ర విభజనను హేతుబద్ధంగా జరపాలని శక్తి వంచన లేకుండా పోరాడినా కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్లు విభజించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో అభద్రతా భావాన్ని పోగొట్టి సీమాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఆ పనిచేసే శక్తి, సామర్థ్యం తనకే ఉన్నాయని, ఆందుకు హైదరాబాద్ అభివృద్ధే నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో అవినీతి పాలనకు, రాష్ట్ర ప్రజలను మోసగించిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాను తెలుగుజాతి కోసమే నిరంతరం ఆలోచిస్తున్నానని, తెలుగు జాతి కోసం, భద్రత కోసం సర్వ విధాల ప్రయత్నం చేశానన్నారు. ప్రజల మనస్సులో నిలిచే నాయకులు ఎన్టీఆర్, వాజ్‌పేయి మాత్రమేనని చెప్పారు.
తన రాజకీయ రికార్డు చరిత్రలో మరెవరికీ ఉండదని. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని ఇప్పుడు మళ్లీ సీమాంధ్రకు ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానని ఆయన అన్నారు. తనకు పదవీవ్యామోహం లేదని, సీమాంధ్రను అభివృద్ధి చేయడాన్ని సవాల్‌గా తీసుకుంటున్నానని ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏక పక్షంగా జరగాలని అన్నారు.
కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, కేంద్రంలో మన సహకారంతో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల భద్రతకు ఇబ్బంది ఉండదని ఆ భరోసా తనదేనని అన్నారు.












Click it and Unblock the Notifications