రాజధాని లేదు, హైదరాబాద్ నుంచి పనిచేయాలి: బాబు
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటి దాకా మన రాష్ట్రానికి రాజధాని లేదని, హైదరాబాద్‌లోనే ఉండి పనిచేయాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళుతున్నామని ఆయన చెప్పారు. ప్రాథమిక రంగ మిషన్‌పై శుక్రవారం విజయవాడలో జరుగుతున్న సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, నీటి పారుదల, పశు సంవర్థక, మత్స్య శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
నిరుడు ఒక విజన్‌ను అమలు చేశామని, 2020 నాటికి భారత దేశంలో మూడు రాష్ర్టాల్లో ఏపీ ఒక రాష్ట్రంగా ఉండాలని, 2029లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఏపీ ఉండాలని ప్రణాళిక తయారు చేసుకున్నామని అన్నారు. ఈ విధంగా ముందుకు వెళ్లడానికి 7 మిషన్లు, 5 గ్రిడ్‌లను రూపొందించుకున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బడ్జెట్‌లో పెట్టిన ప్రకారం నూటికి నూరు శాతం అమలుచేసుకుంటూ వస్తున్నామని ఆయన అన్నారు. 2018-19 నాటికి పొలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మన లక్ష్యమని ఆయన అన్నారు.అత్యున్నత లక్ష్యంతో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. నదుల అనుసంధానంతో వరద నీటిని ఉపయోగించుకోవాలని బాబు సూచించారు.
ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలోని 12 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందిస్తామని ఆయన తెలిపారు. మనం అనుకున్నవి జరగాలంటే అన్ని శాఖల్లో పనితీరు మెరుగుపడాలని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే విద్యుత్ కొరతను అధిగమించామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications