చంద్రబాబు వ్యూహం: తెలంగాణను అడ్డుకోవడమే..?
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడదు తప్పు పట్టడం వెనక విభజనను అడ్డుకోవడమే ఉందని అంటున్నారు. విభజనను తీరును తప్పు పడుతూ ఆయన ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. విభజనను ఆపాలని ఆయన నేరుగా మీడియా సమావేశంలో చెప్పిన ఉదంతం కూడా ఉంది. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూ ఆయన విభజన తీరును వ్యతిరేకిస్తున్నారు.
చంద్రబాబు తీరుతో తెలుగుదేశం తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సీమాంధ్ర శానససభ్యుడు పయ్యావుల కేశవ్ శైలజానాథ్‌తో మాట్లాడారు. గతంలో ఇతర పార్టీల నేతలతో మాట్లాడిన పార్టీ నాయకులపై కొరడా ఝళిపించిన చంద్రబాబు తెలంగాణ విషయంలో మాత్రం మెతక వైఖరి అవలంబిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.

కాగా, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాష్ట్ర విభజనను ఆపాలని మాత్రమే డిమాండ్ చేశారు. తాజాగా, సోమవారం పార్లమెంటు సమావేశాల్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి వర్గం విభజన ముసాయిదా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో సీమాంధ్ర నాయకులు బంద్ పాటించారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ సీమాంధ్ర నేతలు చేస్తున్న పోరాటానికి చంద్రబాబు మద్దతు ఉందని అంటున్నారు.
చంద్రబాబు బయటపడకుండా సీమాంధ్ర నేతలతో విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయిస్తున్నారనే విమర్శలు తెలంగాణవాదుల నుంచి వస్తున్నాయి. సమైక్యాంధ్ర గురించి తమ పార్టీ అధినేత మాట్లాడాల్సిన అవసరం లేదని, తాము పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదని సీమాంధ్ర టిడిపి ఎంపీలు అంటున్నారు. మొత్తం మీద, చంద్రబాబు సమైక్యాంధ్ర వైపు మొగ్గు ప్రదర్శిస్తున్నారనే విమర్శలు మాత్రం వస్తున్నాయి.


Click it and Unblock the Notifications