జగన్‌కి అమ్ముడుపోండి, కోపం తేవొద్దు: ఛానల్స్‌కి బాబు
హైదరాబాద్: ఒకటి రెండు టివి ఛానళ్లు పని గట్టుకొని తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, తనకు కోపం తెప్పించవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. టిడిపిని లక్ష్యంగా చేసుకొని పని గట్టుకొని ఛానళ్లు పని చేస్తున్నాయన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోండి కానీ, తనపై దుష్ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. ఇక ముందు కూడా ఇలానే కొనసాగితే తనకు ఆగ్రహం వస్తుందని చంద్రబాబు నాయుడు ఆ టీవి చానళ్లను ఉద్దేశించి అన్నారు.

ఎన్నికల వేళ టిడిపిలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా కాంగ్రెస్ నేతలు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు సమక్షంలో ఇరువురు నేతలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సీమాంధ్రను సింగపూర్ తరహాలో అభివృద్ధి చేసే సత్తా టిడిపికే ఉందన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల చేయాలని అన్ని పార్టీలు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయం ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్లు రాజకీయాలు మాట్లాడుతున్నారని బాబు మండిపడ్డారు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందని అయితే చట్టాన్ని ఎవరైన చేత్తుల్లోకి తీసుకుంటానంటే ఒప్పుకోనని చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఢిల్లీలోనూ చక్రం తిప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి కొత్తగా వచ్చేవారు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కొన్ని చానళ్లు నేరస్థుడికి వంతపాడుతున్నాయని ఆయన విమర్శించారు. జగన్ పార్టీకి నిజంగా ప్రజల్లో బలం ఉంటే మున్సిపల్ ఫలితాలు ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications