లోకల్ హీట్..జగన్ కొత్త టార్గెట్: వైసీపీ క్యాడర్‌లో భయం: తేడా వస్తే అంతే సంగతులు..!
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించుకునే దిశగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త స్కెచ్ వేస్తోంది. 90 శాతం మేర స్థానాలను గెలుచుకోవాలంటూ ఇప్పటికే తన మంత్రివర్గ సహచరులకు హెచ్చరికలను జారీ చేసిన వైఎస్ జగన్.. తాజాగా పార్టీ క్యాడర్‌కూ సరికొత్తగా టార్గెట్లను నిర్దేశించారు. వైఎస్ఆర్సీపీ విజయం సాధించే స్థానాల్లో మెజారిటీ సీట్లు ఏకగ్రీవం కావాలంటూ ఆయన హుకూం జారీ చేశారు. ఇది కాస్తా వైఎస్ఆర్సీపీ క్యాడర్‌లో గుబులు కలిగిస్తోంది.

నజారానా.. అందుకేనా
పంచాయతీ రాజ్ ఎన్నికల్లో పోటీ మామూలుగా ఉండదు. అసాధారణ స్థితిలో ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. సర్పంచ్‌గా ఎన్నిక కావడం అనే విషయాన్ని చాలామంది ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. గ్రామస్థాయి రాజకీయాలపై పట్టు సాధించడానికి, తమ సత్తాను చాటుకోవడానికి ఈ ఎన్నికలను ఓ వేదికగా వినియోగించుకుంటూంటారు. అలాంటి చోట్ల ఎన్నికలకు భిన్నంగా, ఏకగ్రీవంగా గెలుపొందాలనే టార్గెట్‌ను జగన్ ఫిక్స్ చేశారు. అలా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు ప్రత్యేకమైన గ్రాంట్లు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం.

ఏకగ్రీవాల కోసమే..
రెండు వేల జనాభాలోపు ఉన్న పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే.. అయిదు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది ప్రభుత్వం. రెండు నుంచి అయిదు వేల జనాభా ఉన్న పంచాయతీలో ఎన్నిక ఏకగ్రీవమైతే..10 లక్షల రూపాయలు, పది వేల జనాభా వరకూ ఉన్న పంచాయతీలకు 15 లక్షల రూపాయలు, అంతకు మించి జనాభా ఉన్న మేజర్ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే 20 లక్షల రూపాయల వరకూ నిధులు అందనున్నాయి.

గ్రాంట్లు ప్రకటించిన తరువాత కూడా..
ప్రభుత్వమే ఏకగ్రీవాలను ప్రోత్సహించినట్లు కావడం వల్ల అవన్నీ అధికార పార్టీ ఖాతాలోనే పడేలా చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పార్టీ క్యాడర్‌కు స్పష్టం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో గ్రాంట్లను ప్రకటించిన తరువాత కూడా ఏకపక్షంగా ఎన్నికలను నిర్వహించలేకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చంటూ ఆయన సున్నితంగా హెచ్చరించారు. మంత్రులు కూడా దీనికి మినహాయింపేమీ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.
Recommended Video


మంత్రులకూ వర్తింపు..
ఇదే విధానం మంత్రులకు కూడా వర్తింపజేశారు. మంత్రులు.. తమ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాల్సి ఉంటుందని సూచించారు. దీనితో మంత్రులు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తమ నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండే చోట.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. తాయిలాలను ఇస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే మంత్రులు చాలావరకు విజయం సాధించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications