మోడీ హవా: చిరుకు విశ్రాంతి, 150వ సినిమాకు ఛాన్స్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత చిరంజీవి తన 150వ సినిమాకు పచ్చజెండా ఊపే అవకాశముందనే వాదనలు మరోసారి వినిపిస్తున్నాయి. చిరంజీవి 150వ సినిమా పైన తరుచూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి కూడా పలు సందర్భాల్లో స్పందించారు.
కానీ ఇప్పటి వరకు ఆ సినిమాపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు చిరంజీవి తన మైల్ స్టోన్ సినిమా తీయవచ్చునని అంటున్నారు.
చాలా రోజులుగా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో 150వ సినిమా పైన ఎలాంటి ఊసు లేకుండా పోయింది. పెద్ద ఎత్తున అభిమానులతో పాటు పలువురు నిర్మాతలు చిరంజీవి తదుపరి సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఆయనకు రాజకీయపరంగా కొంత విరామం దొరికే అవకాశముంది. దీంతో అతను తదుపరి సినిమా పైన దృష్టి సారించనున్నారంటున్నారు. కాంగ్రెసు పార్టీ నేతగా, కేంద్రమంత్రిగా ఆయన బిజీగా ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 16వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలను చూస్తే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో చిరంజీవికి రాజకీయంగా కొంత విశ్రాంతి దొరికితే 150వ సినిమా పైన దృష్టి సారించవచ్చు.
చిరు తదుపరి చిత్రం పైన చర్చలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రముఖ రచయితలు పరుచూరి సోదరులు ఓ మంచి స్టోరీతో ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
కాగా, చిరంజీవి మైల్ స్టైన్ చిత్రాన్ని తాను నిర్మిస్తానని రామ్ చరణ్ తేజ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున ఆ ప్రాంతంలో, సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామా చేయలేదని ఆ ప్రాంతంలో చిరు పైన కొంత ఆగ్రహం ఉందని, ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడ ఈ సినిమాను లాంచ్ చేస్తారనే చర్చ అప్పుడే సాగుతోంది.












Click it and Unblock the Notifications