వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం- ఇదే ఫైనల్?
Visakhapatnam Steel Plant: రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం.. మలుపులు తిరుగుతోంది. ఈ మధ్యే ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ సైతం అమలులోకి వచ్చింది. తొలి దశలో 1,140 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అనుమతి లభించింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు జరిగిన నిరసన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
మిత్రపక్షాల సహకారంతో ఏపీలో తామే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయ ప్రయత్నాల్లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం. శరవేగంగా ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతోంది. వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దూకుడు పెంచింది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు. ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, సంయుక్త కార్యదర్శి అబిజిత్ నరేంద్ర, ఎన్ఎండీసీ ఎండీ అమితవ ముఖర్జీ, విశాఖ ఉక్కు ఇన్‌ఛార్జీ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశాఖ ఉక్కు బలోపేతానికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోందన్న విషయంపై చంద్రబాబు ఆరా తీశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలను వారు చంద్రబాబుకు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ.. చంద్రబాబుకు తెలియజేసినట్లు సమాచారం.
ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రతిపాదనలేవీ ఇప్పటివరకు తమ వద్ద లేవని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచలు లేవని పేర్కొన్నారు. విశాఖస్టీల్ ప్లాంట్‌ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, దాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications