మీరేమంటారు?: టిపై లిస్ట్ తయారీకి కిరణ్, వచ్చేదెవరో..
హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, సమైక్యం కోసమే అందరం కట్టుబడి ఉందామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు, మంత్రులకు సూచిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఎంతమంది తనతో కలిసి వస్తారనే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారట.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడించే ఉద్దేశ్యంలో భాగంగా కిరణ్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో వరుసగా భేటీ కానున్నారట. జిల్లాల వారిగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో భేటీ కావాలని కిరణ్ నిర్ణయించుకున్నారట. తద్వారా అసెంబ్లీకి బిల్లు వస్తే ఎంతమంది వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అంచనాకు వచ్చి ఆయన ఓ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనుకుంటున్నారని సమాచారం.

ఒక్కో ఎమ్మెల్యేతో అరగంట పాటు జిల్లాల వారీగా మాట్లాడాలని కిరణ్ నిర్ణయించుకున్నారట. విభజనపై వారి వైఖరిని వ్యక్తిగతంగా తెలుసుకోనున్నారు. మౌఖికంగానే కాకుండా రాతపూర్వకంగా వారి అభిప్రాయాన్ని తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారట.
తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఓడిస్తామని ప్రకటనలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొందరి నేతలలో క్రమంగా మార్పు కనిపించింది. సమైక్యమంటూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, విభజన అనివార్యమైనందున, సీమాంధ్ర ప్రయోజనాల కోసం డిమాండ్ చేయాలనే వాదనలు ముందుకు తెస్తున్నారు.
ఇది సమైక్యం బలంగా వినిపిస్తున్న ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు వస్తే ఎవరెవరు దానిని వ్యతిరేకిస్తారనే చిట్టాను వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి తయారు చేసుకోవాలనుకుంటున్నారట. అధిష్టానం మేరకు నడుచుకుంటామని చెబుతున్న నేతలు కూడా బిల్లు వరకు వస్తే అసెంబ్లీలో వ్యతిరేకించే అవకాశమే ఉంది.
అయితే కిరణ్ సమావేశం ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాల నుండి ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారు? రాతపూర్వకంగా ముఖ్యమంత్రికి సమైక్యంపై అభిప్రాయం చెబుతారా? అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications