పోసానిపై టీడీపీ ఆఫీసులో ఫిర్యాదు- ఉద్యోగం పేరుతో 9 లక్షల మోసం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కేసుల్ని తిరగతోడి ఆయనపై వరుస కేసులు నమోదు చేస్తుండగా.. ఇప్పుడు ఆయనపై ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె.సత్యనారాయణ శెట్టి అనే వ్యక్తి ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళీ, మహేష్ అనే వ్యక్తులు తన వద్ద నుండి రూ. 9 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు.

ఈ మోసంపై తాను హైదరాబాద్ గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని సత్యనారాయణశెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు మోసపోవడంతో ఐదేళ్లనుండి ఇంటీకి కూడా పోలేక, గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నానని తెలిపాడు. తనకు ఇప్పుడు చావే శరణ్యమని, దయ చేసి తనకు రావాల్సిన డబ్బులను పోసాని నుండి ఇప్పించి న్యాయం చేయాలని నేతలు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ లకు అర్జీ ఇచ్చి వాపోయాడు. దీంతో టీడీపీ నేతలు ఈ ఫిర్యాదును పోలీసులకు పంపబోతున్నారు.
గతంలో కేవలం కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదు కావడంతో వీటిపై వరుసగా పోసాని కృష్ణమరళికి కోర్టులు బెయిల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 9 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ దాఖలైన ఈ కేసుపై పోసానిని పోలీసులు ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ నమోదైన అన్ని కేసుల్లో ఊరట లభించినా ఈ కేసులో పోసానిపై చర్యలు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications