మిస్‌ఫైర్: కానిస్టేబుల్ ఛాతీలోకి బుల్లెట్
కడప: కడప జిల్లాలోని రైల్వేకోడూరులోని ఏపీఎస్పీ స్పెషల్ పోలీసు క్యాంప్‌లో బుధవారం తుపాకి మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో 9వ బెటాలియన్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
వివరాలు ఇలా ఉన్నాయి - రైల్వే కోడూరు ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేసేందుకు 23 మంది ఏపీఎస్పీ పోలీసులు వెంకటగిరి సమీపంలోని అంకాలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన క్యాంపులో ఉంటున్నారు. మంగళవారం రాత్రి సత్యనారాయణ అనే కానిస్టేబుల్ సెంట్రీ డ్యూటీ నిర్వహిస్తున్నారు.

అర్థరాత్రి రెండు గంటల సమయంలో తుపాకీ పేలిన చప్పుడు రావడంతో అంతా బయటకు వచ్చి చూడగా కానిస్టేబుల్ సత్యనారాయణ రక్తపుమడుగుల్లో పడి ఉన్నాడు. తుపాకీ మిస్‌ఫైర్ అయిందని గుర్తించిన సహచరులు వెంటనే అతడిని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి ఆందోళనరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు రాయలసీమ ప్రాంతంలో పెద్ద యెత్తున గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగానే పోలీసులు ఈ క్యాంప్ వేశారు.












Click it and Unblock the Notifications