వివాదస్పదమవుతోన్న జీవో..! : దళితులను ముస్లింలను అవమానించారా..!
విజయవాడ : ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని భూములకు సంబంధించిన ఓ జీవోలో దళితులను, ముస్లింలను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి.
దేవాదాయ శాఖ భూములకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.425 ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. జీవోలో పేర్కొన్న అంశాల ప్రకారం ఇకనుంచి దేవాదాయ శాఖ పరిధిలోని భూములను హిందువులే సాగు చేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. అంటే హిందూయేతరులకు హిందూ దేవాలయాల పరిధిలోని భూములను సాగు చేయడానికి అవకాశం లేదన్నమాట.
అయితే దేవాదాయ శాఖ పరిధిలోని భూములను హిందూవులే సాగు చేయాలని జీవో జారీ చేసిన ప్రభుత్వం.. దళితుల విషయంలో మాత్రం మెలిక పెట్టింది. ఒకవేళ దళితులెవరైనా దేవాదాయ శాఖ భూములను సాగు చేయాలనుకుంటే.. సదరు వ్యక్తులు సమీపంలోని చర్చి నుంచి 'నాన్ క్రిస్టియన్' సర్టిఫికెట్ తీసుకురావాలన్న నిబంధన పెట్టింది.

కాగా, ఈరోజుల్లో దళిత వర్గాలే గాక మిగతా కులాల నుంచి కూడా చాలా కుటుంబాలు క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మరి అలాంటప్పుడు మిగతావారికెవరికి పెట్టని నిబంధన ఒక్క దళితులకు మాత్రమే ఎందుకు పెట్టాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇకపోతే ఇప్పటికే హిందూ దేవాలయ భూములను సాగు చేస్తున్న దళితులు గానీ, ముస్లింలు గానీ ఎవరైనా ఉంటే.. తక్షణం ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి సాగు నుంచి తప్పుకోవాల్సిందిగా ప్రభుత్వ జీవోలో పొందుపర్చారు.
ఈ నిబంధనలను బేఖాతరు చేస్తే.. కబ్జా కేసులు తప్పవని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇదిలా ఉంటే, ముస్లింల విషయంలోను ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆ వర్గం నుంచి అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది. హిందూ దేవాలయాల భూములను ముస్లింలు సాగు చేయొద్దని నిబంధన పెడుతున్న ప్రభుత్వం.. అదే విషయాన్ని మసీదు భూముల విషయంలో మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని మసీదు భూములన్ని ఇప్పటికీ హిందూవులు సాగు చేసుకుంటున్నారని చెబుతున్నాయి ముస్లిం వర్గాలు. హిందూ దేవాలయాల భూములను హిందూయేతరులు సాగు చేయొద్దని చెబుతున్న ప్రభుత్వం.. మసీదు భూముల విషయంలో మాత్రం ముస్లింయేతరులు సాగు చేసుకునేలా ఎందుకు అవకాశం ఇస్తోందని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
ఏదేమైనా.. ఆలయ భూముల విషయంలో దళితులు ముస్లింల పట్ల ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఇది ముమ్మాటికీ వివక్షపూరితమే అంటున్నారు పలువురు.












Click it and Unblock the Notifications