అవినీతి ఆరోపణలు: గౌరవం కోల్పోయిన ఎన్టీఆర్ ఏం చేశారు?, జయ కూడా ఇలాగే!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. అసెంబ్లీలోనే వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. దీంతో తీవ్రమైన మనస్థాపానికి గురైన ఆయన.. వెంటనే ఆగ్రహంతో స్పీకర్ పోడియం వద్దకు విసవిసా నడుచుకుంటూ వెళ్లారు.
పోడియం ముందు బైఠాయిస్తారని కాంగ్రెస్ సభ్యులు అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్.. తన భుజంపై ఉన్న కండువాను తీసి స్పీకర్ పోడియంపై పెట్టారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఖంగుతిన్నారు.
కాగా, 'భుజంపై కండువా అనేది ప్రతిష్టకు చిహ్నం. గౌరవానికి ప్రతీక. ఈ సభలో నేను గౌరవాన్ని కోల్పోయాను. నా ఆత్మ గౌరవం దెబ్బతింది. మళ్లీ ముఖ్యమంత్రిగా, సభా నాయకుడిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతా' అని ఎన్టీఆర్ చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు.

అలా సభను బహిష్కరించిన ఆయన ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టడం గమనార్హం. సరిగ్గా ఎన్టీఆర్‌కు జరిగిన ఘటనే జయలలితకూ జరిగింది. 1989 మార్చి 25న ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్న జయలలిత.. సీఎం కరుణానిధిపై విమర్శలు చేశారు.
అవినీతి పెరిగిపోతోందంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో ఆగ్రహించిన డీఎంకే ఎమ్మెల్యేలు ఆమెపై వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాక.. దాడికి తెగబడ్డారు. కొంగుపట్టుకుని ఈడ్చారు. చెదరిన తలకట్టు.. కళ్లనీళ్లతో ఆగ్రహోగ్రురాలైన ఆమె కూడా ఎన్టీఆర్‌లాగానే సవాల్ విసిరారు.
ఆనాడు సభను బహిష్కరించిన ఆమె.. ముఖ్యమంత్రిగా 1991లోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన జయలలిత.. 2016, ఫిబ్రవరి 19న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూడా అత్యధిక సీట్లు కైవసం చేసుకుని మరోసారి, వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.












Click it and Unblock the Notifications