లారీలో 70 సిలిండర్ల పేలుడు: భారీగా ట్రాఫిక్‌జామ్
కర్నూలు: బెంగళూరు నుంచి కర్నూలు వైపు వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. 44వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిలిండర్ల లారీ ప్రమాదానికి గురైంది. దీంతోఅందరూ దూరంగా వెళ్లాలని డ్రైవర్ హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు గ్రామం నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా భారీ శబ్దంతో పేలడం మొదలయ్యాయి. ఈ పేలుడు శబ్ధానికి సమీపంలోని ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

దాదాపు 70 సిలిండర్ల వరకు పేలాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఇనుపముక్కలు ఎగిరిపడ్డాయి. కాగా, డ్రైవర్, క్లీనర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 450 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. సిలిండర్ల పేలుడు ఘటనతో జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని ప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు భారీగా ఎగిసిపడుతుండటం, ఇంకా లారీలో పేలని సిలిండర్లు ఉండటంతో లారీ దగ్గరికి వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో సమీపంలోని ప్రజలను దూరంగా వెళ్లమని సూచించారు.












Click it and Unblock the Notifications