ఒక్కరైనా ఉండాలనే: పురంధేశ్వరిపై దగ్గుబాటి, కంటతడి
ఒంగోలు: మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, పర్చూరు శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు శుక్రవారం కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు దగ్గుబాటి శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా కారంచేడులో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు చెప్పారు. అంతకుముందు కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల నుండి తప్పుకుంటున్నందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పారు. తన నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చునని, మీ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు.

ఇంట్లో ఒకరైనా రాజకీయాలలో ఉండాలనే ఉద్దేశ్యంతో పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తాను రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నందున, పురంధేశ్వరి బిజెపిలో చేరుతున్నారని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగాలని తన పైన ఒత్తిడి తేవద్దని ఆయన కోరారు.
కాగా, రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు కార్యకర్తలతో చెబుతున్న సమయంలో దగ్గుబాటి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు.












Click it and Unblock the Notifications