ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం: రూ100కోట్ల అక్రమాస్తుల డీఈఈ అరెస్ట్
విశాఖపట్నం: భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన విశాఖపట్నం రహదారులు, భవనాల శాఖ ఎస్‌ఇ కార్యాలయంలో డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న సుభాష్‌చంద్ర పాత్రోను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులుండటంతో శనివారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు దాడులు చేశారు. రూ.100 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తులను గుర్తించారు.
అవినీతి నిరోధక శాఖ అదనపు డీజీ ఆర్‌పి ఠాకూర్‌కు అందిన సమాచారం మేరకు.. ఏసీబీ కేంద్ర దర్యాప్తు విభాగం(సి.ఐ.యు.) అధికారులు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించగా విశాఖపట్నంలో కుప్పలుతెప్పలుగా ఆస్తులు వెలుగుచూశాయి.
నగరంలో అనేకచోట్ల కొనుగోలు చేసిన ఈ స్థలాలు, ఇళ్ల మార్కెట్ విలువ రూ.100కోట్లకు పైనే ఉంటుందని భావిస్తున్నారు. పుస్తక విలువ మాత్రం రూ.4.08కోట్లుగా నిర్ధరించారు. మధురవాడ ప్రాంతంలోనే ఏడుచోట్ల స్థలాలు, వాణిజ్య సముదాయం(జి+2) ఉండగా, ఆరిలోవ, చినగంట్యాడ, వుడా కాలనీలలో ఒక్కోటి వంతున, గండిగుండం, భోగాపురంలలో రెండేసి చొప్పున మొత్తం 15 చోట్ల స్థలాలున్నాయి.

విశాలాక్షినగర్లో రెండు ఇళ్లు, వెంకోజీపాలెంలో ఫ్లాట్ ఉన్నట్లు తేల్చారు. విశాలాక్షినగర్లో ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 60 తులాల బంగారు నగలు, ముప్పావు కిలో వెండి వస్తువులు లభ్యమయ్యాయి. రూ.10లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ల పత్రాలు, రూ.29లక్షల నగదు బ్యాంకులో ఉన్నట్లు నిరూపించే బ్యాంకు పుస్తకాలు, రూ.6లక్షల ఎల్‌ఐసి బీమా పత్రాలు, రూ.19లక్షల చిట్టీలు, ఒక కారు, ఒక ద్విచక్రవాహనం ఉన్నట్లు పత్రాలు, రూ. లక్షన్నర నగదు లభ్యమయ్యాయి.
పాత్రో డిప్యూటీ ఈఈ హోదాలో రహదారులు, భవనాల శాఖ ఎలక్ట్రికల్ విభాగానికి మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జిగా ఉన్నట్లు ఏసీబీ అదనపు డీజీ ఠాకూర్ వెల్లడించారు. డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, హైదరాబాద్‌లోని పాత్రో కుమార్తె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రాబ్యాంకు లాకర్ తెరవాల్సి ఉందన్నారు. నిందితుడు పాత్రోను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications