వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం..!!
YS Viveka murder case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది.
రెండు లక్షల రూపాయల పూచికత్తును సమర్పించాలని, ప్రతి వారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని, సంతకాలు చేయాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది. ఏపీకి వెళ్లడంపైనా నిషేధం విధించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏపీకి వెళ్లకూడదని హైకోర్టు షరతులను విధించింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు సీబీఐ అధికారులు 2021 నవంబర్‌లో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో ఆయన అయిదో నిందితుడిగా ఉన్నారు.
అరెస్టయినప్పటి నుంచీ శంకర్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్నారు. అదే సమయంలో బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మంగళవారం నాడు ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదే కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి దేవిరెడ్డి సన్నిహితుడిగా పేరుంది. అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అరెస్ట్ అయ్యారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డి పేర్లను కూడా దస్తగిరి వెల్లడించారు. ప్రస్తుతం వారందరూ అరెస్ట్ అయ్యారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.












Click it and Unblock the Notifications