పోలీసులు బండబూతులు తిట్టారు: ముద్రగడ వ్యాఖ్యలపై తూగో ఎస్పీ వివరణ
అమరావతి: తన కొడుకును లాఠీలతో కొడుతూ తీసుకెళ్లారని, తన భార్యను, కోడలిని బండబూతులు తిట్టారని దీక్ష విరమణ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే.
నా భార్య, కోడల్ని తిట్టారు, బాబుపై పోరాటమే: ముద్రగడ కంటతడి
తన జాతి కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి రోజే మూడు గంటలలోపే పోలీసులు తలుపులు పగులగొట్టుకొని లోపలకు వచ్చారని, తనను మర్యాదగానే తీసుకెళ్లినా, తన భార్య రెక్కలు పట్టుకొని తిడుతూ తీసుకెళ్లి బస్సులో పారేశారని కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన కాకినిడాలో మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. ముద్రగడను ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆయన వర్గీయులతో పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిన మాట నిజమేనన్నారు.
చట్ట ప్రకారం ఆత్మహత్య నేరమన్నారు. ముద్రగడ ఆరోజు చేతిలో పురుగుల మందుపట్టుకున్నారని, బలవన్మరణానికి పాల్పడతానంటే చట్టం ఒప్పుకోదని పేర్కొన్నారు. ఆ సమయంలో ముద్రగడ ప్రాణాలను రక్షించడమే తమ ముందున్న ఏకైక లక్ష్యంగా భావించామని తెలిపారు.
అందుకే ముద్రగడ ఇంటి తలుపులు బద్దలకొట్టి ఆయన్ను ఆసుపత్రికి తరలించామన్నారు. ఆ సమయంలో తమ పని తాము సక్రమంగా చేశామని ఆయన అన్నారు. కాగా, ఈ నెలాఖరు వరకు తూర్పుగోదావరి జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications