ఈడీ విచారణలో మరో ట్విస్ట్ - వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు..!!
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త మలుపు. అనూహ్యంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 18న విచారణకు రావాలని సూచించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే విచారించిన ఈడీ తిరిగి ఈ నెల 20న మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. అటు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న రామచంద్ర పిళ్లైను ఈడీ కస్టడీ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం వెలువరింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు ఇవ్వటం ఈ కేసులో కీలకంగా మారుతోంది.

వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పుడు వైసీపీ ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ అరెస్ట్ కాగా..ఇప్పుడు ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లో సీబీఐ ప్రశ్నించింది. మాగుంటకు చెందిన సంస్థల్లో సోదాలు చేసింది. ఆ సమయంలో ఈ స్కాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని మాగుంట స్పష్టం చేసారు. మరో సందర్భంలో ఇదంతా ఉత్తరాది వ్యాపారులు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ఢిల్లీ లిక్కర స్కాంలో సౌత్ గ్రూపులో మాగుంట రాఘవ కీలకంగా వ్యవహరించారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సౌత్ గ్రూప్‌లో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు.

రిమాండ్ లో మాగుంట తనయుడు రాఘవ
ఈ కేసులో సౌత్ గ్రూపు నుంచి మాగుంట రాఘవ రెడ్డి ఆప్ నేతలకు ముడుపులు అందించారనే అభియోగాలు ఉన్నాయి. మాగుంట కుటుంబానికి చెందినవిగా చెబుతున్న కంపెనీలకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా చెప్పినప్పటికీ, పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు జోన్ 32 , జోన్లకు జోనల్ రిటైల్ లైసెన్సులు లభించియాని చెబుతున్నారు. సౌత్ గ్రూపులో కీలకంగా చెబుతున్న రామచంద్ర పిళ్లై ను ఈ రోజు ఈడీ ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. ఈడీ కస్టడీ పొడిగించాలని కోరారు. కవిత తో పాటుగా పిళ్లైను విచారించాల్సి ఉందని కోర్టుకు ఈడీ నివేదించింది. దీంతో, మూడు రోజుల పాటు పిళ్లైకు ఈడీ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.













Click it and Unblock the Notifications