విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి!
విశాఖ ఉక్కు కర్మాగారంలో (Vizag Steel Plant) సంభవించిన ఘోర ప్రమాద స్థలంలో హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. లిక్విడ్ స్టీల్ (ఉక్కు ద్రవం) ద్వారా బీమ్స్ తయారు చేసే అత్యంత కీలకమైన విభాగంలో ఈ దుర్ఘటన జరిగింది. కరిగిన ఉక్కు ద్రవాన్ని ఒక చోటు నుండి మరోచోటికి తరలిస్తుండగా.. ఒక్కసారిగా ల్యాడీల్ (Ladle) బ్లాస్ట్ అవ్వడంతో మరుగుతున్న ఉక్కు కార్మికులపై లావా ప్రవాహంలా ముంచెత్తింది. ఈ భయానక ప్రమాదంలో మరణాల సంఖ్య తొమ్మిదికి (9) చేరింది. వారంతా అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
గుర్తుపట్టలేనంతగా మారిన మృతదేహాలు..
ప్రమాదం జరిగిన సమయంలో ఆ ల్యాడీల్‌లో సుమారు 150 టన్నుల మరుగుతున్న లిక్విడ్ స్టీల్ మెటల్ ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ఉక్కు ద్రవం ఒక్కసారిగా ఒంటిపై పడటంతో బాధితుల శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాలలో కేవలం నలుగురిని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన ఐదుగురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా బూడిద అవ్వడంతో వారి వివరాలను సేకరించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

చరిత్రలోనే మొదటిసారి.. కార్మిక సంఘాల ఆగ్రహం!
విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఒక ల్యాడీల్ ఈ స్థాయిలో పేలిపోవడం (Ladle Blast) ఇదే మొదటిసారి అని కార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పర్యవేక్షణ లోపం వల్లే ఇంతపెద్ద ఎత్తున 150 టన్నుల వేడి ఉక్కు లీకై బ్లాస్ట్ అయ్యిందని వారు ఆరోపిస్తున్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది లోపలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుడుకు దారితీసిన సాంకేతిక కారణాలపై ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. కర్మాగారం లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు సాగుతున్నాయి. తోటి కార్మికుల మృతితో విశాఖ ఉక్కు నగరంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం..
— apple ap (@Appleap2327) June 8, 2026
- ల్యాడిల్ నుంచి కుప్పకూలిన హాట్ మెంట్ బకెట్లు
- పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడటంతో పలువురు కార్మికులకు గాయాలు
- బకెట్లు కుప్పకూలడంతో పలువురు కార్మికులు మృతి@Justice_4Vizag@RINL_VSP @FactCheckTdp @vizagweatherma9
#VIZAGSTEELPLANT #VIZAG… pic.twitter.com/xYVnFP4nwU
సీఎం దిగ్భ్రాంతి..
ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీస్, వైద్య, అగ్నిమాపక వంటి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని, క్షతగాత్రులకు అత్యవసర మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ చరిత్రలోనే ఇలాంటి ల్యాడీల్ పేలుడు జరగడం ఇదే మొదటిసారి అని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
అత్యంత విషాదకరం: వైఎస్ జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications