అయ్యన్నపాత్రుడికి గంటా వర్గం 'సూపర్ ట్విస్ట్'?
గత అసెంబ్లీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించగా ఆయనకు సొంతపార్టీలోని ప్రత్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి ఓటమిపాలయ్యారు.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికార వైసీపీ, తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడంలేదు. అయితే తెలుగుదేశం పార్టీలోని తెలుగు తమ్ముళ్లు మాత్రం ప్రత్యర్థులపై పోరాడటం మానేసి వారిలో వారే పోరాడుకుంటున్నారు. ఒకరిపై మరొకరు పైచేయిగా నిలవాలనుకొంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.

పార్టీలోనే కొనసాగుతానన్న గంటా
గత అసెంబ్లీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించగా ఆయనకు సొంతపార్టీలోని ప్రత్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి ఓటమిపాలయ్యారు. మూడున్నర సంవత్సరాలపాటు గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలోని ప్రజలకే కాదు.. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా అందుబాటులో లేకుండా పోయారు. తాజాగా లోకేష్ ను కలిసి పార్టీలోనే కొనసాగుతానని చెప్పడంతోపాటు యాత్ర విజయవంతమవడానికి తనవంతు సహకారాన్ని అందిస్తానన్నారు.

ఆయనేమైన పెద్ద నాయకుడా?
మరోవైపు అయ్యన్నపాత్రుడు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచేవారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే గంటా శ్రీనివాసరావుపై తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో కొత్త ప్రచారం నడుస్తోంది. ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని.. గంటా ఏమైనా పెద్ద నాయకుడా? లేదంటే ప్రధానమంత్రా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. పార్టీలో అందరూ పనిచేయాలని, కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొరియల్లో దాక్కున్న ఎలుకలు బయటకు వస్తున్నాయంటూ చురకలు వేశారు.

గంటా వర్గం కొత్త ఎత్తు
అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలకు సంబంధించి గంటా వర్గం కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అయ్యన్న పాత్రుడిని తెలుగుదేశం పార్టీ పెద్దలు కట్టడి చేశారని ప్రచారం చేస్తున్నారు. గంటా విషయంలో ఏమీ మాట్లాడొద్దని చెప్పిందని, పార్టీకి డామేజ్ జరుగుతుందని అయ్యన్నకు చెప్పినట్లుగా గంటా వర్గం చెబుతోంది. అయ్యన్నపాత్రుడి తీరు చూసినవారు మాత్రం గంటా వర్గం ప్రచారాన్ని కొట్టేస్తున్నారు. దూకుడు స్వభావం కలిగివుండే అయ్యన్నకు ఎన్నిసార్లు చెప్పినా మొదటిసారి చెప్పినట్లే అవుతుందని అంటున్నారు. కేసులతో ఇబ్బంది పడింది.. అయ్యన్న, అయ్యన్న కుటుంబం. మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మళ్లీ ప్రాధాన్యం దక్కించుకోవాలనే వ్యూహంతో గంటా వర్గం ఈ పాచిక వేశారంటున్నారు. దీనిపై అయ్యన్న ఎలా స్పందిస్తారోనని తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications