జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం- నో ఫైరింజిన్: వైసీపీలో ఆందోళన
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఆవరణకు ఆనుకుని ఉన్న మొక్కలు మంటల బారిన పడ్డాయి. గడ్డి దగ్ధమైంది. దీన్ని గమనించిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంటలను ఆర్పివేశారు.
ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి. గతంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలు జగన్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలకు జగన్ కారణం అయ్యాడంటూ అప్పట్లో బీజేవైఎం నాయకులు జగన్ నివాసాన్ని ముట్టడించారు.

జగన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లాడానికీ ప్రయత్నించారు. జగన్ నివాసం, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపైకి చెప్పులు విసిరారు. జగన్ దిష్టిబొమ్మనూ దహనం చేశారు. ఆ తరువాత కిందటి నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొందరు కార్యకర్తలు జగన్ ఇంటి ముందు వేడుకలు జరుపుకున్నారు.
కార్లు, బైక్‌లతో భారీ సంఖ్యలో జగన్ ఇంటిముందు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు పదే పదే హారన్ మోగిస్తూ హల్‌చల్ చేశారు. ఈ రెండు ఘటనలు కూడా సెక్యూరిటీ వైఫల్యాలుగా చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూరకంగా జగన్ ఇంటి వద్ద ఈ వేడుకలను నిర్వహించారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది అప్పట్లో.
వైయస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్నిప్రమాదం. సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయి.@ysjagan గారి భద్రతపై ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/tst2y6stCq
— YSR Congress Party (@YSRCParty) February 5, 2025
ఇప్పుడు తాజాగా జగన్ ఇంటి ముందు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది. మంటలు చెలరేగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వాటిని ఆర్పివేశారు. ఫైరింజిన్ రాకపోవడం వల్ల చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పివేయడం కనిపించింది.
ఒకవైపు ఆర్పుతుంటే మరో వైపు అగ్నికీలలు వ్యాప్తి చెందాయి. వాటిని పూర్తిగా అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది సెక్యూరిటీ సిబ్బందికి. ఫైరింజిన్ అందుబాటులో లేకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ తప్పుపడుతోంది. ఇది- ఉద్దేశపూరక ఘటనగా ఆ పార్టీ నాయకులు అభివర్ణిస్తోన్నారు.












Click it and Unblock the Notifications