ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా..తొలి కేసు నమోదు.. ఎక్కడంటే..?
దేశంలో కోవిడ్-19 మళ్ళీ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది. తాజాగా ఏపీలో కూడా కరోనా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. వైజాగ్‌లో తొలి కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

కీలక సూచనలు జారీ చేసిన ఆరోగ్య శాఖ
పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలు వంటి సమూహ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
60 ఏళ్లు పైబడిన పెద్దలు, గర్భిణులు ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.చేతులు తరచుగా కడుక్కోవాలి. దగ్గు లేదా తుమ్ము వస్తే నోరు కప్పుకోవాలి, ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి. ఎక్కువ మంది ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం చాలా అవసరం. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు తప్పకుండా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి.అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లకండి. ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడండి.
వైద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు
హెల్త్ డైరెక్టర్ అన్ని జిల్లాల వైద్యాధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే, 24 గంటల పరీక్షల సదుపాయం కలిగిన ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలని, ప్రతి జిల్లాలోని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications