కండువాలతో అసెంబ్లీ కళకళ: బాలకృష్ణ, రోజా హుషారు
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఆవరణ కళకళలాడింది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు పసుపు రంగు కండువాలు ధరించి రాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తమ పార్టీ కండువాలు ధరించి వచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘన నివాళి సమర్పించి అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించేందుకు, స్పీకర్ ఎన్నిక నిర్వహణ కోసం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం 9.15 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే పి నారాయణ స్వామిని నియమించారు.
11.52 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ నారాయణ స్వామి తొలుత చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. అసెంబ్లీ లాబీలూ కిటకిటలాడాయి. సందర్శకులను అనుమతించకపోయినా మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యేలు లాబీల్లో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కనిపించారు.

కొత్తగా ఎన్నికై మొదటిసారి అసెంబ్లీ ఆవరణలో అడుగు పెట్టిన ఎమ్మెల్యేలు తమ ప్రమాణం పూర్తి కాగానే లాబీల్లో తిరిగారు. ఇంకా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. స్వాతంత్ర్యంవచ్చిన తర్వాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
నాడు 1902 సంవత్సరంలో నిజాం (6వ) నిర్మించిన టౌను హాలునే 1956 సంవత్సరంలో అసెంబ్లీగా మార్చారు. ఆ హాలునే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీగా కేటాయించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మొదటి గేటు నుంచి స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు ఆవరణలోకి వచ్చేవారు.
రాష్ట్ర విభజన జరిగినందున, ఒకే ప్రాంగణంలో రెండు అసెంబ్లీలూ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు మొదటి గేటును ఉపయోగించకుండా, రెండవ గేటు నుంచి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను కూడా మొదటి గేటు ముందు ఉన్న గ్రిల్స్ లోపలి భాగం నుంచి రెండవ గేటు ద్వారా ఆవరణలోకి వచ్చేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. మొదటి గేటు వైపు వాహనాలను అనుమతించలేదు. సినీ నటులు బాలకృష్ణ, రోజా తమ పార్టీ ఎమ్మెల్యేలతో హుషారుగా మాట్లాడుతూ కనిపించారు.












Click it and Unblock the Notifications