తేది, ప్లేస్ చెప్పు: పొన్నాలకు హరీష్ సవాల్, నిప్పులు
హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు నిప్పులు చెరిగారు. పొన్నాల వైయస్ ఏజెంట్ అని, మేడారంలో కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు మొక్కారని ధ్వజమెత్తారు. అక్రమ ప్రాజెక్టులపై నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. 'తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా' అంటూ పొన్నాల విసిరిన సవాల్‌ను తెరాస స్వీకరించింది.
వైయస్‌కు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేశారంటూ పొన్నాలపై హరీశ్పూర్తిస్థాయిలో ఎదురుదాడికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులు, ఉద్యోగాలు, అభివృద్ధి.. ఇలా ఏ రంగంపైనైనా తలపడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ రంగాల్లో జరిగిన అన్యాయాలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు సవాలు విసిరారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయంపై ఇప్పటికే 10 ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీకి వేశామని, ఆ పార్టీ తమ సవాల్‌ను స్వీకరించకుండా పారిపోయిందని హరీశ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో మీరు అభివృద్ధి చేశామంటున్నారు కదా... ఎన్నికల్లో ప్రజల తీరును దానిపై రెఫరెండంగా స్వీకరించడానికి సిద్ధమేనా? తెరాస వల్ల తెలంగాణ రాలేదన్న మీ వ్యాఖ్యలు ఆత్మవంచనకు పరాకాష్ఠ అన్నారు.
కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని మేమే కాదని, సర్వే సత్యనారాయణ , డిఎస్ సహా మీ నేతలెందరో అన్నారని, ఆ సిడిలు తమ వద్ద ఉన్నాయన్నారు. పోనీ తెలంగాణ ఎవరు తెచ్చారనేది ప్రజలనే అడుగుదామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్రను చూసి ఓట్లేయండి అంటూ మీరు, తెలంగాణ ఉద్యమంలో తెరాస పాత్ర చూసి ఓట్లేయమంటూ తాము పోటీ చేద్దామన్నారు. ఉద్యమం ఎవరు చేసిందీ ప్రజల వద్దకు పోయి తేల్చుకుందామన్నారు.
కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపైనా తలపడతామంటూ పొన్నాలను సవాల్ చేశారు. వైయస్ హయాంలో కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే మంత్రిగా ఉండి, ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేసే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ఎందుకు మాట్లాడలేదన్నారు. పోతిరెడ్డిపాడు నిర్మాణానికి వ్యతిరేకంగా 2004లో తెరాస ప్రభుత్వం నుంచి బయటకొచ్చిందన్నారు.
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని నిండు శాసనసభలో కిరణ్ చెబితే మాట్లాడలేదని, సమ్మక్క సారలమ్మ జాతరలో కిరణ్ కాళ్లు మొక్కి, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీశావని విమర్శించారు. వైయస్ బతికున్న ప్పుడే ఆయనకు కలెక్షన్ ఏజెంట్‌గిరి చేసిన పొన్నాలతో ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్నారు. ఏ ప్రాజెక్టు వద్దకు రావాలో, ఎప్పుడు రావాలో చెప్పాలని, తాము వస్తామని, బాగోతం బయటపెడతామన్నారు. ఉద్యోగులు సహా ఏ రంగంలోనైనా చర్చకు సిద్ధమన్నారు. సమయం, స్థలం చెబితే వస్తామని సవాలు విసిరారు.












Click it and Unblock the Notifications