జైలులో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. ఆరోగ్య సమస్యలతో బాధపడటంతో జైలు అధికారులు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీ గత కొన్ని రోజులుగా నడుము నొప్పి, కాళ్ల వాపుతో బాధపడుతున్నట్లు సమాచారం. సమస్యలు తీవ్రమవడంతో డాక్టర్లు గుండె సంబంధిత పరీక్షలు, రక్తపరీక్షలు చేశారు. రెండు గంటలపాటు వివిధ వైద్య పరీక్షల అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు.
దాదాపు రెండు నెలల నుంచి వల్లభనేని వంశీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలపై వల్లభనేని వంశీ మోహన్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించగా.. అప్పటి నుంచి వల్లభనేని వంశీ రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు ఆయనపై పలు కేసులు నమోదవుతూ ఉండటంతో రిమాండ్ కొనసాగుతోంది.

2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతే కాకుండా అక్కడున్న వాహనాలను తగలబెట్టారు. ఆ సమయంలోనే పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్న సత్యవర్ధన్‌ను వంశీ కులం పేరుతో దూషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలోనే వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
మరోవైపు వంశీ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య సైతం ఇటీవల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో వంశీని బెయిల్ పై విడుదల చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications