'బాబు ఇంత చేస్తున్నారా, నాకు నిజంగా తెలియదు', 'మోడీ దెబ్బకు తోక ముడిచారు'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన జిఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు ప్రశంసలు కురిపించారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన జిఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును చూసి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు తాను చంద్రబాబు నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు.
ఈ రోజు (శుక్రవారం) రాజాంలో తొలిసారి పాల్గొన్నానని, కానీ సీఎంను చూస్తుంటే చాలా నేర్చుకోవాలనిపిస్తోందన్నారు. సీఎం సభలో మాట్లాడుతుంటే ఇన్ని పథకాలు అమలు చేస్తోందన్న సంగతి నిజంగా తనకు తెలియదని, నిరుపేదల కష్టాలను గుర్తించి అమలు చేయడం సామాన్య విషయం కాదన్నారు.
విభజన నేపథ్యంలో ఏపీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఓ పక్క రాజధాని నిర్మాణం, మరో పక్క పలు అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. తనవంతుగా రాజాం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

ప్రజలు మోడీ వైపే: సోము వీర్రాజు
నోట్ల రద్దుతో సామాన్యులు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ, దాని వెనుక ఉన్న సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని మోడీ వైపు నిలిచారని బీజేపీ నేత సోము వీర్రాజు ఢిల్లీలో అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు, కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉగ్రవాదులు తోక ముడిచారన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు కొంత ఇబ్బందిపడ్డారనీ, అయినప్పటికీ ప్రజలంతా మోడీ వైపే నిలిచారని చెప్పారు.
పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో ఉగ్రవాదం తగ్గుతుందని కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో మంచి మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నోట్లరద్దు అనంతర పరిస్థితులపై చర్చ జరిగింది. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ బలోపేతంపైనా చర్చించారు.












Click it and Unblock the Notifications