మురళీమోహన్ సహా వారు బిజెపికి నో, బాబుకు చిక్కు
హైదరాబాద్: తాము బరిలో నిలిచిన లోకసభ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంటును కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వవద్దని, అలా ఇస్తే తమకు మైనస్ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు పలువురు వాపోతున్నారట. బిజెపికి కేటాయించే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తమకు ఓట్ల లోటు ఏర్పడుతుందని ఇది మొత్తంగా తమ గెలుపు అవకాశాలనే దెబ్బతిస్తుందని పేర్కొంటున్నారట. అందులో మురళీ మోహన్, జెసి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివ రావు వంటి వారు ఉన్నారట.
ఈ విషయాన్ని వారు చంద్రబాబు దృష్టికి ఇప్పటికే తీసుకు వెళ్లారట. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయనున్న రఘురామకృష్ణ రాజు కూడా అదే వాదన వినిపిస్తున్నారట. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి ఇవ్వొద్దని ఆయన కోరుకుంటున్నారట. నర్సరావుపేట లోక్‌సభ టికెట్ సాధించిన రాయపాటి... నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ను బిజెపికి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారట. నర్సారావుపేటలో టిడిపి లేకుంటే పోటీ నుండి తప్పుకుంటానని చెబుతున్నారట.

నర్సరావుపేటను పక్కన పెట్టి మంగళగిరిని బిజెపికి ఇద్దామంటే... దానికి గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ససేమీరా అంటున్నారట. మురళీ మోహన్ కొన్నేళ్లుగా రాజమండ్రి లోకసభ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి గెలుపుపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. అంతలోనే రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయించడంతో మురళీమోహన్ తీవ్ర ఆందోళన చెందుతున్నారట.
అనంతపురం టిడిపి ఎంపి అభ్యర్థి జెసి పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదట. అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో బిజెపికి ఇవ్వొద్దని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారట. ఎంపీ అభ్యర్థుల అభ్యంతరాలు, ఇతరత్రా కారణాల నేపథ్యంలో సీమాంధ్రలో బిజెపికి సీట్లు సర్దుబాటు చేయడం టిడిపి అధిష్టానానికి తలకు మించిన భారంగా మారిందంటున్నారు. బిజెపికి ఇచ్చిన సీట్లలో ఆ పార్టీకి బలం లేదని టిడిపి వాదిస్తుండగా... మోడీ బలం తమకు కలిసి వస్తుందని బిజెపి చెబుతోంది.












Click it and Unblock the Notifications