మల్కాజిగిరి బరిలో 30 మంది, సీమాంధ్రలో ప్రారంభం

తెలంగాణలో చాలామంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. లోకసభ స్థానాల్లో 39 మంది నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ఉపసంహరణ అనంతరం 17 లోకసభ నియోజకవర్గాల్లో 267 మంది, 119 శాసనసభ నియోజకవర్గాల్లో 1669 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ - సిపిఐ, టిడిపి - బిజెపి, ఖమ్మంలో జగన్ పార్టీ - సిపిఎం మధ్య పొత్తులు కుదిరినా... ఆయా స్థానాల్లో రెబెల్స్ బరిలో నిలవడంతో సర్దుబాటు ఆదిలోనే ఆటుపోట్లకు గురైంది.
మెదక్ లోకసభ స్థానంలో తెరాస అధినేత కెసిఆర్‌పై తిరుగుబాటు అభ్యర్థిగా దిగిన బీరయ్య యాదవ్ పక్కకు తప్పుకొనేందుకు ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే టికెట్ కాకపోయినా కనీసం జడ్పీటీసీగానైనా అవకాశమివ్వనందుకే కెసిఆర్‌ను ఢీకొంటున్నానంటున్నారు. వరంగల్ జిల్లా పరకాలలో తెరాస రెబెల్ భిక్షపతి శుక్రవారమే నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. వరంగల్ జిల్లా పరకాలలో టిడిపి టికెట్ ఆశించి నామినేషన్ వేసిన మండల శ్రీరాములు నామినేషన్ వెనక్కి తీసుకుని కాంగ్రెస్‌లో చేరిపోయారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కూడా బరి నుంచి తప్పుకున్నారు. మెదక్ అసెంబ్లీలో కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అగ్రనేతల బుజ్జగింపుతో బరి నుంచి తప్పుకొన్నారు. పాలకుర్తిలో బిజెపి తరఫున పోటీ చేయాలని భావించిన పెదగాను సోమయ్య కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నర్సంపేటలో కాంగ్రెస్ రెబెల్‌గా బరిలో నిలిచిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి దొంతి మాధవ రెడ్డి రాజీనామా చేశారు. స్వతంత్రుడిగా బరిలో నిలిచారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి రెబెల్స్ బెడద చాలా వరకూ తగ్గింది. దాదాపు 90 శాతం రెబెల్ అభ్యర్థులు శనివారం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాగా, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధికంగా 30 మంది చొప్పున పోటీలో నిలిచారు. అతి తక్కువగా నాగర్ కర్నూలు నుంచి ఆరుగురు పోటీ పడుతున్నారు. అంబర్‌పేట అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 32, సికింద్రాబాద్‌లో 31 మంది బరిలో నిలిచారు.
ఆదిలాబాద్ జిల్లాబోద్, మెదక్ జిల్లా ఆందోల్‌లో అత్యల్పంగా ఐదేసి నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 298 మంది అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఆ తర్వాతి స్థానం రంగారెడ్డి (284) జిల్లాదే. మిగిలిన ఏ జిల్లాలోనూ నామినేషన్ల సంఖ్య 200 దాటలేదు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీలు జరుగుతున్నాయి.
సీమాంధ్రలో మోగిన నగారా
మరోవైపు సీమాంధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. తొలి రోజు ఎంపీ స్థానాలకు పదిహేడు, ఎమ్మెల్యే స్థానాలకు 58కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సీమాంధ్రలోని 25 లోకసభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే ఏడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19వ తేదీని చివరి గడువుగా విధించారు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications