హైటెక్ బస్సు దగ్ధం: ప్రయాణికుల అప్రమత్తం, సేఫ్
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద 5వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రవీణ్ ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు దగ్ధమైంది. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపేశారు.
బస్సులోని ప్రయాణికులందరూ కిందిగి దిగిన కొద్ది సేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చాగల్లు సమీపంలో ఈ ఘటన జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నారు. వేగంగా మంటలు అంటుకోవడంతో బస్సులోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. కాగా, హైదరాబాద్‌కు చెందిన నూతన దంపతులు నికేష్ హేమాద్రి, కళ్యాణికి చెందిన రూ. 10లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, నగదు అగ్నికి అహుతయ్యాయి. హైదరాబాద్‌లో శిక్షణ కోసం వెళ్తుండగా తమ సర్టిఫికెట్లు మొత్తం కాలి బూడిదయ్యాయని చెన్నైకి చెందిన నలుగురు విద్యార్థులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో నెల్లూరు వైపు వెళ్తున్న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ఛైర్మన్ అవినాష్ దేవిచంద్ర ఘటనా స్థలం వద్ద ఆగి బాధితులకు సాయం చేశారు. సమాచారం అందించినా సమయానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications