ఫుల్ క్లారిటీ ఉంది, పాతికేళ్లు ఉండటానికొచ్చా, రాజకీయం అంటే తిట్టుకోవడం కాదు: పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మూడ్రోజులు గడిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మూడ్రోజులు గడిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
మూడు రోజుల్లో ఆరు జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేసినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ప్రయత్నం నెరవేరిందని, ఇది తన మొదటి అడుగని చెప్పారు.

ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోనే...
తన మూడ్రోజుల తెలంగాణ పర్యటనలో తన భావాలను కార్యకర్తలకు తెలియజేశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళుతున్నానని, తనకెవరిపైనా ద్వేషం లేదని అన్నారు. సినిమాల్లోనూ నటిస్తారా? పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటారా? అని ఆయనను ప్రశ్నించగా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని ఇప్పటికే చెప్పేశానని సమాధానం ఇచ్చారు.

బేరీజు వేసుకుంటున్నా.. భయపడడం లేదు...
తెలంగాణ సమస్యల అవగాహనకు మరింత సమయం పడుతుందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకుంటే తనను వేరుగా చూస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తాను ఏపీపైనే దృష్టి ఎక్కువగా పెట్టానని, అందుకే ఇప్పుడు తెలంగాణలో పర్యటించానని పవన్ కళ్యాణ్ వివరించారు. . తెలంగాణ ఉద్యమం నేర్పుగా, ఓర్పుగా జరిగిందని, అందుకే తెలంగాణపై ఎలా మాట్లాడాలో బేరీజు వేసుకుంటున్నానని, భయపడడం లేదని చెప్పారు.

పాతికేళ్ల రాజకీయ ప్రయాణం కోసం వచ్చాను...
తాను పాతికేళ్ల రాజకీయ ప్రయాణం కోసం వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాలంటే తిట్టుకోవడం, నీఛమైన భాష వాడటం కాదన్నారు. రాజకీయం అంటే ప్రత్యర్థులను విమర్శించడం మాత్రమే కాదని, ప్రజలకు మంచి చేయాలని అనుకోవడమని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒక మంచి మార్పును తాను కోరుకుంటున్నానని తెలిపారు. రాజకీయం అనేది నాయకుడికి ఒక గురుతర బాధ్యత అని వ్యాఖ్యానించారు.

అధికార కాంక్ష వేరు, అసెంబ్లీకి వెళ్లడం వేరు...
కార్యకర్తల నుంచి వచ్చిన సూచనల మేరకే తాను తెలంగాణ పర్యటనలో మాట్లాడినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. పదవులపై ఆశ లేకపోతే ఇక ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కొందరు విమర్శిస్తోన్న నేపథ్యంలో ఆ విమర్శపై పవన్ స్పందించారు. అధికార కాంక్ష వేరు.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లడం వేరన్నారు. అసలు అధికార కాంక్ష, అధికార దాహం.. ఇలాంటి పదాలు వాడటమే తనకిష్టం లేదని పవన్ వ్యాఖ్యానించారు.

వాళ్లకే పడదు.. నేను వాళ్లకు ఏజెంటునా?
చంద్రబాబు, కేసీఆర్ లకు పవన్ కళ్యాణ్ ఏజెంట్ అని కొందరు చేస్తున్న విమర్శలపై సమాధానమిస్తూ.. అసలు చంద్రబాబు, కేసీఆర్‌లకే పడదని, అలాంటి తాను వాళ్లకు ఏజెంట్ ఎలా అవుతానని ప్రశ్నించారు. రాజకీయాల్లో తనకు క్లారిటీ లేదంటూ కొంతమంది చేస్తోన్న వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. రాజకీయాలపై తనకు పూర్తి క్లారిటీ ఉందన్నారు. ఎవరికి క్లారిటీ ఉందో, ఎవరికి లేదో.. మున్ముందు చూద్దాం అని వ్యాఖ్యానించారు. తన తదుపరి పర్యటన ఏపీలో ఉంటుందని, అనంతపురంలో సమస్యలను ఆధ్యయనం చేస్తానని చెప్పారు జనసేనాని.












Click it and Unblock the Notifications