టిడిపిలోనే ఉంటా: కెసిఆర్‌తో బేటీ తర్వాత ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్న వారెవరో తెలుసుకుని, వారి పని పడతామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, పార్టీ అధినేత బీసీల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు జరిగేలా చూడాలని సీఎంను కోరానని కృష్ణయ్య తెలిపారు.

స్కాలర్‌షిప్‌లు, డీఎస్సీ నిర్వహణ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని కోరినట్టు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీవేసి నిర్ణయం తీసుకుంటుందని కెసిఆర్ చెప్పినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు పీఆర్‌సీ అమలు, పదవీ విరమణ వయసు 60కి పెంచాలని కోరినట్టు తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తితో ఉన్న కృష్ణయ్య తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే వార్తలు వచ్చాయి. తెలుగుదేశం శాసనసభా పక్షంలో స్థానం కల్పించకపోవడంపై కృష్ణయ్య మనస్తాపానికి గురైనట్లు కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications