ఎపి వ్యక్తిగా ఢిల్లీకి, టివ్యక్తిగా వస్తా: కెసిఆర్, మీడియాపై..

హైదరాబాద్: తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీకి వెళ్తున్నానని, వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పదిహేను రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఇదే చిట్టచివరి అసెంబ్లీ సమావేశమన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వంద శాతం తెలంగాణ బిల్లు పెట్టనున్నారన్నారు. బిల్లు పెడతామని తనకు ఢిల్లీ పెద్దలు చెబుతున్నారన్నారు.

తాను పద్నాలుగేళ్లుగా వాదిస్తూ వస్తోందే ఈ రోజు అసెంబ్లీలో కనిపించిందన్నారు. లంకలో పుట్టిన వారంతా రాక్షసులు అన్నట్లు.. ఆంధ్రా నాయకులు అంతా తమ నిజ స్వరూపాలు బయట పెట్టుకున్నారన్నారు. ఇంత చిల్ల రాజకీయాలా అన్నారు. వారిది తెలివి తక్కువతనమా? లేక ఉన్మాదమా? అన్నారు. అపరమేథావుల్లా ఫోజులు కొట్టే జయప్రకాశ్ నారాయణ, చంద్రబాబు లాంటి వారు కూడా తెలంగాణ బిల్లుకు అడ్డుపడే ప్రయత్నం చేశారన్నారు. విజయమ్మ కూడా ఆ కోవలోని వ్యక్తే అన్నారు.

Kalvakuntla Chandrasekhar Rao

తెలంగాణ రాష్ట్రం వస్తుందని, సీమాంధ్ర నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తమ కల నెరవేరబోతుందని, బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుందామన్నారు. ఈ రోజుతో అసెంబ్లీలో శాసన సభ ప్రక్రియ ముగిసిపోయిందని, ఇక పార్లమెంటులో ఉందన్నారు. కిరణ్, చంద్రబాబులు ఇంకా ఏం చేసినా తెలంగాణ ఆగదని, తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలన్నారు. తెలంగాణ తప్పకుండా ఇస్తామని కేంద్రపెద్దలు తనతో చెప్పారన్నారు. కిరణ్ ప్రవర్తన సిఎం స్థాయిలో లేదని, ఆయనకు భంగపాటు తప్పదన్నారు.

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభకు ఎలాంటి హక్కులు లేవని, అభిప్రాయాలు మాత్రమే చెప్పవచ్చునని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరి ఇదే చివరిదన్నారు. బిల్లును తిరస్కరించినట్లు సభాపతి చెప్పలేదని, చర్చ ముగిసిందని మాత్రమే చెప్పారన్నారు. చంద్రబాబుకు తలకాయ ఉందా అన్నారు. సీమాంధ్రలో నాలుగు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఢిల్లీ పెద్దలతో మాట్లాడానని, రేపు ఢిల్లీకి వెళ్తున్నానని, ఏం ఫర్వాలేదు తెలంగాణ రాష్ట్రంతో మీరు రాష్ట్రానికి వెళ్లండని చెప్పారన్నారు.

విడిపోయేందుకు ఏకాభిప్రాయం కావాలంటున్న వారు కలిసుండేందుకు ఏకాభిప్రాయం అవసరం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రక అవసరాన్ని కేంద్రం గుర్తించిందని అందుకే విభజనకు పూనుకుందన్నారు. ఆంధ్ర - తెలంగాణ ప్రాంతాల మధ్య కొందరు విషబీజాలు నాటుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రా నేతలు అంటేనే తెలంగాణ ప్రజలకు కోపం వచ్చేలా వారే చేసుకున్నారన్నారు. భౌగోళికంగా పక్కపక్కన ఉండే మన మధ్య విషబీజాలు నాటుతున్నారన్నారు.

పదిహేను రోజుల్లో తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని, దానిని రాసి పెట్టుకోవచ్చన్నారు. తెలంగాణ ఏర్పడుతుందని తనకు ఎవరు చెప్పారో వారే చెప్పారన్నారు. తనకు డేట్స్ కూడా తెలుసునని కానీ, ఇప్పుడు చెప్పనన్నారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఎవరేం చేస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు చెబుతామన్నారు. విభజన గెలుపోటముల సమస్య కాదని, కోట్లాది ప్రజల జీవితాలకు సంబంధించిందన్నారు.

డీలిమిటేషన్ పైన...

తనకున్న సమాచారం మేరకు తెలంగాణలో సీట్లు పెంచే అవకాశముందన్నారు. దానికి తాము కూడా అంగీకరిస్తామన్నారు. అయితే డీలిమిటేషన్ ఇప్పుడు ఉండదన్నారు. 2014 ఎన్నికల అనంతరం డీలిమిటేషన్ ఉంటుందని, 2019 ఎన్నికల కోసం సీట్లు పెరుగుతాయన్నారు.

బిజెపిపై...

భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చెప్పినంత మాత్రాన తెలంగాణ పైన ఆ పార్టీ వెనక్కి పోయినట్లా అని ప్రశ్నించారు. బిజెపి కార్యవర్గం కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందన్నారు.

బంగారు తెలంగాణ...

ప్రస్తుతం తెలంగాణ వచ్చినా తమ పార్టీకి బలం లేదన్నారు. తాను జీవితంలో ఎప్పుడూ ఓడిపోలేదన్నారు. ఎమ్మెల్యే అవ్వాలనుకొని అయ్యానని, మంత్రిని కావాలనుకొని అయ్యానని, తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నానని అది కూడా సాధించుకుంటున్నామని, ఇక బంగారు తెలంగాణ కోసం కలలు కంటున్నానని దానిని కూడా సాధిస్తానన్నారు. తనను మానసికంగా వేధించారని, తన స్థానంలో ఎవరైనా ఉంటే పారిపోయేవాళ్లన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పకుండా అమరవీరులకు అంకితమన్నారు. ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

ముఖ్యమంత్రి బిల్లు వ్యాఖ్యలకు కౌంటర్

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కెసిఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి ఎప్పుడైనా ముసాయిదా బిల్లే వస్తుందన్నారు. ఏ బిల్లు అయినా అనేక మార్పులకు చేర్పులకు అవకాశం ఉంటుందని కాబట్టి దానిని ముసాయిదా బిల్లు అంటారని, పార్లమెంటులో ఆమోదం పొందాకే దానిని బిల్లు అంటారని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నకిలీ బిల్లు, డుప్లికేట్ బిల్లు, అసలు బిల్లు అంటూ ఉండదన్నారు.

మీడియాపై చిందులు

ఓ సెక్షన్ మీడియా తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. వారి రాతలతో, వారి కూతలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. రాజ్యసభకు రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తే దానిని ఎంతో చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిజం విలువలు అవి కావన్నారు. పిచ్చి బొమ్మలు, పిచ్చి రాతలు మానుకోవాలన్నారు. మీడియా పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలన్నారు. మీడియా కొంత నిబద్దదతో, జర్నలిజం విలువలతో ముందుకు పోవాలన్నారు. మీడియా అంటే న్యూసా లేక వ్యూసా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+